మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుమ్మెరలో పసిగుడ్డు మృతి ఘటన మాటలకు అందని మహా విషాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఆ పసిగుడ్డు ఏం అడిగింది. మీరు ఎక్కిన గద్దె అడిగిందా? మీరు మూటగట్టుకున్న ముల్లెలు అడిగిందా? తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది’ అంటూ కన్నెర్రజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కుమ్మెర బాధితులకు అండగా బుధవారం ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ధర్నాలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తల్లి.. దేవుడి దర్శనం అడిగిన పాపానికి.. జరిగిన ఈ దాడి మానవత్వానికే మచ్చ అని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ సమాజమే తలదించుకునే దుర్మార్గ ఘటన కుమ్మెరలో జరిగిందని వాపోయారు. ‘దర్శనానికి పోతా అంటే కులం పేరుతో దూషించడమే కాకుండా గణేశ్‌పై 25 మంది దాడిచేసి తన్నినచోట తన్నకుండా తన్ని ఆ తమ్ముడిని ఇబ్బందులు పెడితే.. అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసి అయినా విడిచి పెట్టండి అన్నా.. మావోడు ఒక్కడే ఉన్నాడు.. మీరు 20 మంది ఉన్నరు.. అని మౌనిక తన పసి బిడ్డను కాళ్ల ముందల పెట్టి వదిలిపెట్టండని ప్రాధేయపడిందని.. అయినా దుర్మార్గుడు, మానవ మృగంలాంటి మనిషి.. వాడెవడో చెత్త నా కొడుకు కాలితో తంతే ఆ శిశువు చనిపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఇలాంటి మానవ మృగాలను శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నరని నేను అడుగుతున్నా.. ‘మా బిడ్డ మీద దాడి జరిగింది.. మా మీద దాడి జరిగింది’ అని గణేశ్, మౌనిక ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కు పోతే.. ‘లేదు లేదు.. మీరు సరిగా రాయలేదు’ అని అన్నాడట ఓ పోలీస్ ఆయన.. నేను అడుగుతున్నా ఆ పోలీస్ అధికారిని. ఈ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలే. రేవంత్‌రెడ్డో.. ఆయన తొత్తులో కాదు. నువ్వు సేవ చేయాల్సింది బాధితులకు.. ఎవరి మీదైతే దాడి జరిగిందో వాళ్లొచ్చి నీకు ఫిర్యాదు చేస్తే కైంప్లెంట్ సరిగ్గా లేదని అంటావా? సుమోటోగా తీసుకోవాలి. తప్పు జరిగితే నీ అంతట నీవు సుమోటోగా కేసు తీసుకోవాలి.

వాళ్లు షికాయత్ చేసే అవసరం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినవ్? బాధితులు వచ్చి నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేస్తావా? అయ్యా నీ మీద కైంప్లెంట్ వచ్చింది. మీరు వచ్చి కౌంటర్ కైంప్లెంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్లను ప్రేరేపించి వేసుకున్న యూనిఫామ్‌కు విలువ లేకుండా.. చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా.. పోలీసు అనే గౌరవాన్ని కోల్పోయే విధంగా నువ్వు వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నవ్’ అని నిప్పులు చెరిగారు.
‘ఇవాళ పసిపాప చనిపోతే పెట్టాల్సింది హత్య కేసు కాదా? ఆ 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లను జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా? ఈ నాగర్‌కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి అని నేను అడుగుతున్నా? ఇవాళ రోడ్డెక్కి ఆ బిడ్డ చనిపోయి ఇంకా మూడ్రోజులు కూడా కాలే.. ఆ తల్లి ఇవాళ బిడ్డకు పాలియ్యాల్సిన టైంలో కన్నీళ్లతో ఇక్కడ రోడ్డెక్కి అంబేద్కర్ సాక్షిగా చౌరస్తాలో కూర్చుంటే.. ఇక్కడి స్థానిక యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని ఖననం చేసిండ్రు’ అని ధ్వజమెత్తారు. ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్ర హం సాక్షిగా ఆ తల్లి ఏం అడుగుతుంది? న్యాయమే కదా?’ అని నిలదీశారు.
‘నేను అడిగిన చంద్రకళను.. అమ్మా.. మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం.. ఇల్లు కట్టిస్తాం అంటే ఆమె ఏమన్నదో తెలుసా? అది తర్వాత సంగతి అన్నా.. ముందు వాళ్లకు శిక్ష పడేటట్టు చేయిండ్రి.. మీరు అసెంబ్లీలో మాట్లాడుండ్రి.. రాష్ట్రం దృష్టికి తీసుకుపోండ్రి.. బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి.. తండ్రికి న్యాయం చేయిండ్రని వేడుకున్నది’ అని తెలిపారు.
‘ఇంతకుమించి ఏం అడగాలి వాళ్లు? ఏం తప్పు చేసింది ఆ పిల్ల? రెండు నెలల పసి గుడ్డుకు కులం తెలుసా? మతం తెలుసా? అధికారం తెలుసా? ఏం తెలుసు? మనిషి పుట్టాక పుట్టేది కులం.. మనిషి పుట్టాక పుట్టేది మతం.. ఇవాళ దానికోసం మనుషులను చిన్నచూపు చూసి.. దేవుడి దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి.. మళ్లీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డుమీద కూర్చునే పరిస్థితి తెచ్చిండ్రు. ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబాన్ని రోడ్డుమీదికి తెచ్చిన వ్యవస్థను చూసి ఈ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ రాజకీయం మాట్లాడటానికో.. రాజకీయం చేయడానికో నేనిక్కడికి రాలేదు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.

రెండు నెలల పసిపాప ప్రాణాలు పోయినయ్. ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కడి గుండె బరువెక్కి మాటలు రాని పరిస్థితి ఉన్నది. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదిది. కానీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఇటు మీడియాకు.. అటు ప్రజలు, సమాజంలో ఉన్న మనందరి మీదా ఉన్నది.
– కేటీఆర్
‘స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని అడుగుతున్నా.. ఎవరు చేసినా.. ఏ పార్టీ చేసినా.. హంతకుడు హంతకుడే.. వాడు ఏ పార్టీ వాడైనా.. ఏ మనిషి అయినా కఠినంగా శిక్షించాల్సిందే.. 8 మంది హంతకుల ముఠా కలిసి ఆ పాప చావుకు కారణమైండ్రు. ఆ ఎనిమిది మందిని జైల్లో పెట్టాలి. ఆ ఎనిమిది మందిని హత్యానేరం కింద అరెస్టు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం కూడా కచ్చితంగా స్పందించి.. ఈ దుర్మార్గమైన.. అహంకారం, ఆధిపత్యం, అధికార అండతో ఆ పసిగుడ్డును ఎవరు హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలి.. అవసరమైతే ఉరిశిక్ష వేయాలి.
బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలి.. కుటుంబంలో చదువుకున్నవాళ్లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ‘న్యాయం కోసం కుటుంబానికి అండగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, బీఆర్ఎస్ తరఫున కొట్లాడుతున్నారు.. ఈ పోరాటం ఆపకండి.. న్యాయం జరిగే వరకు మీ వెంబడి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఉంటడు. ఒక దీక్షతోనో ఒక ధర్నాతోనో ఈ కుటుంబానికి న్యాయం జరగదు.. న్యాయం జరిగేదాకా.. దుర్మార్గులను శిక్షించే దాకా వదిలిపెట్టను’ అని తేల్చి చెప్పారు. ‘మానవత్వానికే మచ్చ తెచ్చిన ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టొద్దు.. రాష్ట్ర మొత్తం మీద ఒక సందేశం వెళ్లాలి.
ఇట్లాంటివి ఎక్కడ జరిగినా సమాజం ఊరుకోవద్దు. బాధిత కుటుంబానికి అండ గా అంటూ నాగర్‌కర్నూల్ నుంచి సందేశమిద్దాం’ అని పిలుపునిచ్చారు. కందనూలులో మాజీ మం త్రి, దివంగత మహేంద్రనాథ్ చూపించిన సామాజిక న్యాయం దక్కేలా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, దురదృష్టకరమని వాపోయారు. ‘ఆ పసి గుడ్డుకు మనం ఇవ్వగలిగే ఒకే ఒక నివాళి.. పసిపిల్ల చావుకు కారణమైన హంతకులకు శిక్ష పడాలె.. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయడమే’ అని తెలిపారు.
‘ఇందులో రాజకీయాలు వద్దు.. ఫలానా వారిని తిట్టడం వద్దు.. హంతకులు ఏ పార్టీ వారైనా.. ఎవరైనా.. వాళ్లను శిక్షించే దాకా వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. ‘శాసనసభ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ లోపల న్యాయం చేసి ఆ ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే.. వారి మీద హత్యా నేరం మోపకపోతే తప్పకుండా శాసనసభలో వదిలిపెట్టం.. గల్లా పట్టి ప్రభుత్వాన్ని అడుగుతాం’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

ఏ టైంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? 21వ శతాబ్దంలో కూడా కులాలు, మతాల పేరిట అవమానించడం.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యా రాజకీయాలు చేయడం.. హంతకుడినే కాపాడే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఏ ఒక్కరినీ నిందిస్తలేం. పసిగుడ్డు ప్రాణం తీసిన హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరూ దోషే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తప్పే.
– కేటీఆర్
బాధిత కుటుంబాన్ని దీక్షా శిబిరానికి తీసుకురానివ్వడం లేదని తెలిసి పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ‘దాడి జరిగిన సమయంలో ఉన్న సీసీ కెమెరాలు తర్వాత కనిపించలేదని, మీ తప్పే లేనప్పుడు ఎందుకు తీసేశారు?’ అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయడానికి వెళితే సీఐ కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తూ కేసు పెట్టకుండా బాధితులపైనే కౌంటర్ కేసు పెట్టించాడని మండిపడ్డారు. గాయపడిన పసిబిడ్డ చనిపోయే సరికి నింద తమపైకి వస్తుందన్న కారణంతో కోర్టు సలహా కోసం పంపామంటూ కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ విషయంపై ప్రశ్నిస్తే డీఎస్పీ వద్ద సమాధానం లేదని, నీళ్లు నములుతున్నాడని చెప్పారు.ఘటనకు కారకులైన కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షపడేలా చేయాల్సిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో మాట్లాడించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘మీ తప్పు లేకపోతే బాధితులను పరామర్శించకుండా ఎందుకు ఉన్నారు’ అని ప్రశ్నించారు.
కుమ్మెర ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వాపోయారు. మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో కులాలు, మతాలకు అతీతంగా ఉద్యమం జరిగిన గొప్ప నేల కందనూలు అని గుర్తుచేశారు. అలాంటి ప్రాంతంలో రజక కుటుంబంపై జరిగిన దాడి, చిన్నారి మరణం దారుణమని వాపోయారు. పార్టీలకతీతంగా బాధిత కుటుంబానికి న్యాయంకోసం చేస్తున్న పోరాటం గొప్పదని చెప్పారు. చంద్రకళ కుటుంబాన్ని వెలివేసిన తీరును పాట రూపంలో వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని, కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి బుధవారం దీక్షలో కూర్చున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతోపాటు బీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ముందుగా కేటీఆర్ వస్తున్నారని తెలిసి నాగర్‌కర్నూల్ ఆర్డీవో హడావుడిగా శిబిరం వద్దకు వెళ్లి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చాడంటూ బాధితులను తీసుకువెళ్లారు. కేటీఆర్ వచ్చే సమయానికి తీసుకువస్తామని చెప్పి కావాలనే ఆలస్యం చేశారు. కేటీఆర్ వచ్చిన విషయం తెలిసి బీఆర్ఎస్ నాయకులు హుటాహుటిన బాధితులను పంపాలని కోరినా వారిని వేరేచోటుకు తరలించారు.
చివరికి బాధితులను శిబిరం వద్దకు నాయకులు తీసుకురావడంతో వారితోపాటే కేటీఆర్ దీక్షలో కూర్చున్నారు. కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆ పసి గుడ్డు ఏమడిగింది? కుమ్మెరలో జాతర జరిగితే మల్లన్న దర్శనం అడిగింది. దేవుడికి దండం పెట్టే అవకాశం అడిగింది. ఆ తల్లి దేవుడి దర్శనం అడిగిన పాపానికి.. జరిగిన ఈ దాడి మానవత్వానికే మచ్చ. తెలంగాణ సమాజమే తలదించుకునే దుర్మార్గమైన ఘటన.
– కేటీఆర్
కుమ్మెరలో దర్శనానికి వెళ్లిన బీసీ కుటుంబాన్ని అడ్డుకున్నప్పుడు ప్రశ్నిస్తే దాడి చేయడం ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. కాలితో తన్ని పసిపాప మరణానికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టపగలు వేలాది మంది భక్తులు చూస్తుండగానే గణేశ్‌ను గదిలో వేసి బంధించి దాడి చేయడం, పసికందుతో ఉన్న బాలింత మౌనికపై దాడి చేయడం అమానుషమని వాపోయారు.
గాయపడిన శిశువుతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే పట్టించుకోకుండా దాడి చేసిన వారికి సమాచారం అందించి.. వారితోనే కౌంటర్ ఫిర్యాదు తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసు పెట్టినరోజు పట్టించుకోని పోలీసులు ఈరో జు నిరసనలు, ఆందోళనలు జరిగే సరికి నిందితులను ఇప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఘటనపై రెండు రోజుల క్రితం డీజీపీని కలిశామని, పాలమూరులో ఈ అరాచకాలు ఏమిటని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.