Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్, ఒబ్దుల్లాగంజ్ ప్రాంతంలోని సీఎం మోహన్ యాదవ్ నివాసం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటనలు 100 శాతం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. క్రాంతికారి కిసాన్ మజ్దూర్ సంఘటన్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు.
సీఎం ఇంటివరకు రైతులు మార్చ్ నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన కొనసాగుతుందని ఈ సంఘం అధ్యక్షుడు అరుణ్ పటేల్ తెలిపారు. పప్పు ధాన్యాల్ని కనీస మద్దతు ధరతో వంద శాతం కొనుగోలు చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. అలాగే, ఈ టోకెన్ల విధానాన్ని రద్దు చేయాలని, ల్యాండ్ రికార్డుల ఆధారంగా ఫెర్టిలైజర్లను సబ్సిడిపై అందజేయాలని కోరారు. సీఎం ఇంటి ఎదుట ఆందోళన చేసేందుకు వందల మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను, భద్రతా బలగాలను మోహరించారు. జైజవాన్.. జై కిసాన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. ఐదు రోజులకు సరిపడా ఆహార పదార్థాల్ని తీసుకుని రైతులు ట్రాక్టర్ ట్రాలీలతో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. రైతులు వాటిని తొలగించి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.
అయితే, ఈ అంశంపై సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. రైతుల డిమాండ్లు పరిష్కరించేందుకు, వారితో చర్చించేందుకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని సీఎం చెప్పారు. మంత్రులు కన్సానా, క్రిష్ణ గౌర్, విశ్వాస్ సారంగ్, రాకేష్ సింగ్‌తోపాటు అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రైతులతో మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి. అయితే, సమస్య పరిష్కారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.