మంచిర్యాల, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న మంత్రి వివేక్ కనుసన్నల్లోనే గొడవ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ ప్లానింగ్ చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు దానిని అమలు చేశారని, ఇందుకు పోలీసులు సైతం పూర్తిగా సహకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఫిబ్రవరి 16, 17 తేదీల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్‌కు ఓ రూల్.. బీఆర్ఎస్కు ఓ రూల్ అమలు చేశారనే ఆరోపణలొస్తున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన వీడియోలు మంచిర్యాల జిల్లా పోలీసుల పక్షపాత ధోరణిని బయటపెట్టాయి. బీఆర్ఎస్ నాయకులను క్యాతనపల్లి ైఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్న సమయంలోనే, వందలాది మంది కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ, బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతూ దూసుకొస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు దాడిలో పాల్గొన్నారనడానికి అవసరమైన ఆధారాలు సైతం ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కాయి. క్యాతనపల్లి ఫ్లై ఓవర్ మీదకు మంత్రి కాన్వాయ్ వచ్చిన సమయంలో, ఆయన కాన్వాయ్ పక్కన నిల్చున్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులపైకి ట్రాఫిక్ కోన్లు, రాళ్లు విసిరారు. మంత్రి వివేక్ కారు వెనుక నుంచి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడిచేసినట్టు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఏకపక్షంగా బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టిన పోలీసులు.. ఈ ఫొటోలతోనైనా దాడికి ప్రేరేపించిన, దాడికి కారకులైన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
గొడవలు సృష్టించి, ఎన్నికను వాయిదా వేయించాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లకు అనుమతించిన ఫ్లై ఓవర్ మార్గంలోనే మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్ వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్లానింగ్ ప్రకారమే అక్కడ గొడవ జరిగిందని, ఆయన సూచనల మేరకే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి కేసులు నమోదు చేశారన్న విమర్శలున్నాయి. మంత్రి రావడానికి ముందే ఒకేసారి వందలాదిగా దూసుకొచ్చిన కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. మంత్రి కాన్వాయ్ వచ్చిన తరువాత కూడా మరోసారి అక్కడికి చేరుకొని రాళ్లు, ట్రాఫిక్ కోన్లతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. అసలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుళ్లను కొట్టింది కూడా ఓ కాంగ్రెస్ నాయకుడేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు జరుగాల్సిన 16వ తేదీన గానీ, మరుసటి రోజు 17వ తేదీన గానీ పోలీసులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. బీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి కేవలం గెలుపొందిన కౌన్సిలర్లు, ఓటు హక్కు ఉన్న మంత్రి, ఎంపీలకు మాత్రమే క్యాతన్పల్లిలోకి అనుమతి ఉన్నది. ఇది బీఆర్ఎస్ నాయకులే కాదు.. కాంగ్రెస్ నాయకులకూ వర్తించాలి. కానీ 16వ తేదీన బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి బయల్దేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కానీ, అప్పటికే వందల మంది కాంగ్రెస్ లీడర్లు, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మరో నాయకుడు అజీజ్‌పాషా క్యాతనపల్లి మున్సిపాలిటీ సమీపంలో వేసిన టెంట్ కిందకు చేరుకున్నప్పటికీ పట్టించుకోలేదు. మరుసటి రోజు 17వ తేదీ సైతం ఇదే నిబంధన అమల్లో ఉంటే బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్ల మాదిరిగానే, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఓటు హక్కు ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ మాత్రమే క్యాతనపల్లి లోపలికి రావాలి. కానీ, వారితోపాటు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డిని మరుసటి రోజు సైతం ఎలా అనుమతించారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేవలం బీఆర్ఎస్ నాయకులకే అడ్డొచ్చిన రూల్స్.. కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అడ్డురాలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు నిబంధనలు పాటించలేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. క్యాతనపల్లిలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత, మంత్రి వివేక్ మైక్‌లో మాట్లాడారు. ఏ పార్టీ గెలిచినా నిధులు తానే ఇవ్వాలని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలంటూ మంత్రి ప్రసంగించారని బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లు చెప్తున్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు ముందు ఎక్స్ అఫీషియో ఓటర్‌గా ఉన్న మంత్రి ఇలా ప్రసంగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ బయటికి రావాలంటే క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతం ఏం జరిగిందో ఆ వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరికాదంటూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.