Raj Thackeray : మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత (MNS Chief) రాజ్ ఠాక్రే (Raj Thakre) మరోసారి కేంద్ర ప్రభుత్వం (Union govt) పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), మాధవన్ (Madhavan) గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వాన్ని ప్రశంసించే వారు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని ప్రశ్నించారు.
ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ థాక్రే.. ‘దేశంలో అన్నీ బాగున్నాయని, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని చెబుతున్న వివేక్ ఒబెరాయ్, మాధవన్ తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు..?’ అని ప్రశ్నించారు. దేశంపైన, ప్రధాని మోదీపైన అంత ప్రేమ ఉంటే విదేశాల్లో నివసించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.
ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రంలో ఆయన పాత్రలో వివేక్ నటించారని, అలాంటి వ్యక్తి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారని రాజ్ థాక్రే అన్నారు. అలాగే మాధవన్ కూడా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారని, ఆయన కూడా దుబాయ్‌లోనే నివసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సినిమాలు చేసి, సంపాదించి విదేశాలకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. కాగా తన కుమారుడు వేదాంత్ ఈత శిక్షణ కోసం దుబాయ్‌కి వెళ్లినట్లు మాధవన్ గతంలోనే వెల్లడించారు.
తన పన్నులన్నీ భారతదేశంలోనే చెల్లిస్తున్నానని, తన వృత్తిపరమైన అనుబంధం కూడా భారతదేశంతోనే కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఇక తన వ్యాపార కార్యకలాపాల కోసమే దుబాయ్‌లో నివసిస్తున్నట్టు వివేక్ ఒబెరాయ్ గతంలో చెప్పారు.