మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్‌లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక అంతే.. స్టార్ట్ అయితే ఒట్టు. ఇక చేసేదేమీ లేక మహిళా కండక్టర్లే తలో చేయి వేసి బస్సును నెట్టారు. మంగళవారం హైదరాబాద్ వన్ డిపో నుండి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు వెళ్లిన ఆర్టీసీ బస్సు (నంబర్ టీఎస్ 07యు జె 2400) తిరుగు ప్రయాణంలో మక్తల్ బస్టాండ్‌కు వచ్చింది.
అయితే.. అక్కడ ఉండగానే సాంకేతిక లోపం కారణంగా స్టార్ట్ కాలేదు. సమస్యను గమనించిన డ్రైవర్.. బస్సు స్టార్ట్ కావాలంటే నెట్టాలని సూచించాడు. కానీ, అక్కడున్న ప్రయాణికులు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో, బస్టాండ్‌లో ఉన్నటువంటి మహిళా కండక్టర్లు రంగంలోకి దిగారు. విధినిర్వహణలో మాకిది మామూలే అని చాటుతూ బస్సును తోసి బస్సు స్టార్ట్ అయ్యేందుకు సాయపడ్డారు. కొందరు ప్రయాణికులు కూడా సహకరించడంతో బస్ స్టార్ట్ అయింది.
రాష్ట్రంలో కనీవినీ ఎరగని రీతిలో ప్రజా పాలన అందిస్తున్నామని, ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతుంటే, ఆర్టీసీ బస్సుల తీరు ఈ విధంగా ఉంది. దాంతో, బస్సుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని, ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. అంతేకాదు కాలం చెల్లిన డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి కొనాలని సూచిస్తున్నారు.