PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం వీరి భేటీ జరిగింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, చమురు సంక్షోభం, ధరల నియంత్రణ, చమురు నిల్వలు, సరఫరా వంటి అంశాలపై వీరు చర్చించారు. ప్రధానంగా ఎల్పీజీ ధరల పెరుగుదలపై చర్చించినట్లు సమచారం.
ఈ సందర్భంగా దేశంలో చమురు ధరల నియంత్రణపై, గృహ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశాన్ని చమురు ధరల అంశం కలవరపెడుతోంది. ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ వంటి గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎల్పీజీ ధరలు స్వల్పంగా పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. డిమాండ్‌కు సరిపడా ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. ఇండియా తన చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశీ దిగుతులపైనే ఆధారపడుతుంది.
మనకు అవసరమైన ఎల్పీజీలో 62 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. ఈ దిగుమతి అవుతున్న దాంట్లో 85 నుంచి 90 శాతం వరకు హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. అలాంటిది ఈ సంధి మూసివేయడంతో చమురు సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇండియా ప్రతి ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుంది. ఇందులో గృహావసరాల కోసమే 87 శాతం వాడితే, మిగతా 13 శాతమే వాణిజ్య పరంగా వాడుతున్నారు. ఇప్పటికే చమురు సంక్షోభం నేపథ్యలో పలు చోట్ల ఆంక్షలు మొదలయ్యాయి. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించడంతో వీటిని ఎక్కువగా వినియోగించి హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితిపై నిరంతరం సమీక్ష జరిపేందుకు కేంద్రం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.