– బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, మార్చి 10 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రజా పాలన పేరుతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆరు పథకాల పేరిట లక్షలాది దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను మరిపించేందుకు ఇప్పుడు ప్రగతి ప్రణాళిక పేరుతో మరో నాటకానికి తెరతీసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.