రావల్కోట్, జూలై 28 : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. స్థానిక చట్టసభలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో, సోమవారం ప్రారంభమైన మొదటి విడత ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ ర్యాలీ నిర్వహించిన నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రావల్కోట్తో పాటు పలు ప్రాంతాల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగగా, రావల్కోట్ ఈద్గా గ్రౌండ్‌కు వేలాది మంది ఆందోళనకారులు చేరుకున్నారు. ర్యాలీ తీస్తుండగా, తమపై భద్రతా దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు బాధితులు ఆరోపించారు.
కాగా, అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించగా, పలువురు గాయపడ్డారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆరోపించింది. ఎన్నికల రిగ్గింగ్‌పై ఈ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో గత రెండు వారాల నుంచి బ్యాంక్‌లు మూతపడ్డాయి. పలుచోట్ల మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ ప్రాంతానికి నిత్యావసరాలు, ఇతర వస్తువుల సరఫరా ఆగిపోయింది. కాగా, పీవోకేలో 45 స్థానాలకు ఈ నెల 27న ఒకే విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాటిని జూలై 27, ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీలలో మూడు విడతలుగా నిర్వహిస్తున్నారు.