Melania-Peng | వైట్‌హౌస్ (White House) తూర్పు, పశ్చిమ దేశాల దౌత్యపరంగానే కాకుండా భిన్నమైన ఫ్యాషన్ శైలులకు ఆకర్షణగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సతీమణి మెలానియా ట్రంప్.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, సతీమణి పెంగ్ లియువాన్‌లకు అధికారిక విందుకు స్వాగతం పలికారు. అయితే ఇరుదేశాల ప్రథమ మహిళలు అయిన వారు ధరించిన వస్త్రాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకరిది ఆధునికతకు, మరొకరిది సంప్రదాయానికి నిలువుటద్దంగా నిలిచాయి. మెలానియా తెల్లని బో బ్లౌజ్, పెంగ్ మాండరిన్ కాలర్ గౌనును ధరించారు. దీంతో అభిముఖ దిక్కుల దేశాల భిన్నమైన ఆహార్యం అందరి దృష్టిని ఆకర్షించింది.
మెలానియా తెల్లటి సెయింట్ లారెంట్ బ్లౌజు, నల్లటి బ్రోకేడ్ డోల్స్, గబానా ప్యాంటు ధరించారు. ఆధునిక, క్లీన్ కట్, వెస్ట్రన్ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇతర దేశాల ప్రథమ మహిళలా తమ సొంత దేశపు బ్రాండ్లకే పరిమితం కాకుండా యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ డిజైనర్ దుస్తులను ధరించారు. ఇది ఆమెకు నాలుగో అధికారిక విందు. పెంగ్ నేలను తాకే ఎర్రటి, మాండరిన్ కాలర్, మణికట్టును తాకే స్లీవ్స్ గౌనును ధరించారు. చైనీస్ సంస్కృతిలో సూర్యుడు, అగ్ని, శ్రేయస్సుకు ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. రెండు వరుసల ముత్యాల హారం కూడా ధరించారు.
ఫ్యాషన్ (Fashion) విశ్లేషకులు తమకు నచ్చిన విధంగా చర్చించుకుంటున్నారు. ఒకరు ఆధునిక ఫ్యాషన్ ధోరణులను, మరొకరు తమ సంస్కృతిని అనుసరిస్తూ తమ హుందాతనాన్ని ప్రదర్శించారని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ విందుకు అతిథిగా వచ్చిన లారెన్ సాంచెజ్ (జెఫ్ బెజోస్ భార్య) ధరించిన 2000ల నాటి అలెగ్జాండర్ మెక్‌క్వీన్, ఆర్కైవ్ దుస్తులపై కూడా చర్చించుకున్నారు.