India Hockey A Team : యూరప్ పర్యటనను విజయంతో ఆరంభించిన భారత హాకీ ‘ఏ’ జట్టు (India Hockey A Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 2-3తో ఓటమి పాలైంది యంగ్ ఇండియా. ఫార్వర్డు ఆటగాళ్లు మణిందర్ సింగ్ (Maninder Singh), ఉత్తమ్ సింగ్ (Uttam Singh) చెరో గోల్‌తో ప్రత్యర్థిని కంగారెత్తించారు. కానీ, ఆఖర్లో ఇంగ్లండ్ ప్లేయర్లు దూకుడుగా ఆడి నిర్ణయాత్మక గోల్ సాధించారు. దాంతో, యువ భారత జట్టుకు షాక్ తప్పలేదు.
‘యూరప్ పర్యటన ఆరంభంలో మేము మూడు అద్భుత విజయాలు సాధించాం. కానీ, వరుసగా రెండు ఓటములు ఎదురయ్యాయి. టోర్నీ జరుగుతున్న కొద్దీ మాకు కఠినమైన ప్రత్యర్థులు ఎదురవుతారనే విషయం మాకు తెలుసు. ఇకపై ఒక్కో మ్యాచ్ గెలవడంపై దృష్టి పెడుతాం. తదుపరి మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. రెండు బలమైన జట్లను ఢీకొనబోతున్నాం’ అని ఇంగ్లండ్‌పై ఓటమి అనంతరం కోచ్ శివేంద్ర సింగ్ వెల్లడించాడు. గురువారం బెల్జియంతో, జూలై 18న నెదర్లాండ్స్‌తో భారత ఏ జట్టు తలపడనుంది.