Noida : నోయిడాలో ఆసక్తికర ఘటన జరిగింది. స్కూల్ బస్సులో నిద్రపోయిన ఒక చిన్నారి బాలుడు ఏడు గంటలు అందులోనే ఉండిపోయాడు. బస్సులోంచి బయటికి ఎలా రావాలో తెలియక ఒంటరిగా అల్లాడిపోయాడు. ఈ ఘటన నోయిడా పరిధిలో గురువారం జరిగింది. నోయిడాలో ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన ఐదేళ్ల బాలుడిని అతడి తల్లి గురువారం ఉదయం స్కూల్ బస్సు ఎక్కించింది. తర్వాత కొంతసేపటికి బస్సు స్కూల్కు చేరుకుంది.
అందరు విద్యార్థులు బస్సు దిగి స్కూల్కు వెళ్లిపోయారు. కానీ, ఈ బాలుడు మాత్రం వెనకాల ఒక సీట్లో పడుకుని అలాగే ఉండిపోయాడు. బస్సు సిబ్బంది, స్కూల్ సిబ్బంది కూడా గమనించలేదు. అనంతరం బస్సును చాలా దూరంగా పార్కింగ్ ప్లేసులో నిలిపి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆ పార్కింగ్ ప్లేసులో వాహనాలు తప్ప ఎవరూ లేరు. మధ్యాహ్నం ఆ చిన్నారి బాలుడి కోసం తల్లి స్కూల్కు వచ్చింది. కానీ, బాలుడు స్కూల్కు రాలేదని యాజమాన్యం చెప్పింది. తానే స్కూల్ బస్సు ఎక్కించానని తల్లి చెప్పింది. దీంతో స్కూల్ బస్సు అటెండెన్స్ చెక్ చేయగా బాలుడు అందులోకి ఎక్కినట్లు ఉంది. అంతే.. బాలుడు ఎలా మిస్సయ్యాడో తెలియక తల్లి, స్కూల్ సిబ్బంది, బస్సు సిబ్బంది తలలు పట్టుకున్నారు. భయాందోళనకు గురై బాలుడి గురించి వెతకడం ప్రారంభించారు. చివరకు చాలా సేపటి తర్వాత బాలుడిని పార్కింగ్ చేసిన బస్సులో గుర్తించారు. బాలుడిని గుర్తించేందుకు ఏడు గంటలు పట్టింది. అంటే ఏడు గంటలపాటు బాలుడు బస్సులోనే ఉండిపోయాడు.
ఒంటరిగా సాయం కోసం అర్థించినా, అక్కడ చిన్నారిని పట్టించుకునే వాళ్లెవరూ లేరు. ఏడుస్తూ గంటలపాటు ఎదురు చూశాడు. చివరకు బాలుడిని గుర్తించిన సిబ్బంది తల్లికి అప్పగించారు. ఈ ఘటనలో బస్సు సిబ్బంది, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో బస్సుల్ని మార్చడం వల్ల ఈ పొరపాటు జరిగిందని, చిన్నారి బాలుడిని తల్లికి అప్పగించామని యాజమాన్యం తెలిపింది.