చెన్నూర్ టౌన్ : ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దని చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్ రావు సూచించారు. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. పట్టణంలోని ఆదర్శ్ నగర్ కు చెందిన రత్న రాజేశ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్లి తన సమస్యను వివరించాడు.
దీంతో చెన్నూర్ టౌన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పి.దేవేందర్ రావు FIR నమోదు చేసి కేసు ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ మోసగాడి బ్యాంకు ఖాతా నుంచి బాధితుడు రాజేశ్ రెడ్డి అక్కౌంట్కు 16 వేల రూపాయలు జమ చేయించారు. మనీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని మంగళవారం బాధితుడికి సీఐ దేవేందర్ రావు అందజేశారు.
ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ మోసగాళ్ళ వలలో పడకుండా జాగ్రతగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే గంటలోపే 1930 కి కాల్ చేయాలని చెప్పారు. ఈ కీలక కాలాన్ని Golden Hour అని అంటారని సీఐ తెలిపారు. రత్న రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర పోషించిన సైబర్ వారియర్ ఎన్. జీవన్ రావును సీఐ దేవేందర్ అభినందించారు.