హుబ్లీ: జమ్మూకశ్మీర్ సాధించింది! 1959-60 సీజన్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. 67 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 92 ఏండ్ల రంజీ చరిత్రలో తాము తొలి మ్యాచ్ ఆడిన 24,150 రోజుల తర్వాత మొదటి టైటిల్ను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయాన్ని లిఖించింది. 2025-26 సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆ జట్టు.. హుబ్లీ వేదికగా 8 సార్లు చాంపియన్ కర్ణాటకతో ఫైనల్ పోరును డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (291 రన్స్)తో విజేతగా నిలిచింది. నాలుగో రోజే ఆ జట్టు విజయం ఖాయమైనా చరిత్రాత్మక క్షణాల కోసం ఐదో రోజు రెండో సెషన్ వరకూ ఆగాల్సి వచ్చింది. తమ క్రికెట్ గతిని మార్చిన ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వీక్షిస్తుండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యేక అతిథిగా ఆసీనుడై ఉండగా ఆ జట్టు కన్నడ గడ్డపై తమ విజయ ప్రస్థానాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పింది.
ఓవర్ నైట్ స్కోరు 186/4తో ఆట ఐదో రోజును ఆరంభించిన జమ్మూకశ్మీర్.. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్), సాహిల్ లోత్రా (101 నాటౌట్) అజేయ శతకాలు బాదడంతో తమ ఆధిక్యాన్ని ఏకంగా 633 పరుగులకు పెంచుకుంది. మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మధ్యాహ్నం 2.15 గంటలకు ఇరుజట్ల సారథులు మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. అంతే.. ఆరున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాక్షాత్కారమవడంతో జమ్మూకశ్మీర్ ఆటగాళ్ల సంబురాలు మిన్నంటాయి. ఆ జట్టు విజయంతో ప్రధాని మోడీ, క్రికెటర్లు సచిన్, గంగూలీ, యువరాజ్ వంటి దిగ్గజాలతో పాటు ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఫైనల్లో సెంచరీ చేసిన శుభమ్ పుందిర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సీజన్ ఆసాంతం రాణించి 60 వికెట్లు పడగొట్టిన అకిబ్ నబీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది. కాగా, తొలి రంజీ టైటిల్ గెలిచిన జమ్మూకశ్మీర్ జట్టుకు సీఎం ఒమర్ అబ్దుల్లా రూ. 2 కోట్ల నగదు బహుమానం ప్రకటించారు.