న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశీయ రోడ్లపైకి మరికొన్ని కార్లు దూసుకుపోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు వాహనాలతో కొనుగోలుదారులను ఆకట్టుకున్న దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు వచ్చే నెలలో మరిన్ని వాహనాలను విడుదల చేయబోతున్నాయి. వీటిలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్‌తోపాటు రెనో, ఆడీ, స్కోడా, టయోటా సంస్థలు ఉన్నాయి. చౌకైన ఎస్‌యూవీతోపాటు ప్రీమియం లగ్జరీ కార్లున్నాయి. వీటి వివరాలు..
రెనో డస్టర్ సరికొత్తగా..
ఫ్రెంచ్‌నకు చెందిన రెనో డస్టర్ మళ్లీ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. మార్చి 17న ఈ కారును ప్రవేశపెడుతున్నట్టు రెనో ప్రకటించింది. 2022లో ఈ మాడల్‌ను ఉపసంహరించుకున్న సంస్థ మళ్లీ నాలుగేండ్ల తర్వాత అందుబాటులోకి తీసుకొస్తున్నది. రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్: 100 హెచ్‌పీ, 1 లీటర్, 163 హెచ్‌పీ, 1.3 లీటర్ ఫోర్-సిలిండర్‌తో తీర్చిదిద్దింది. ఈ రెండు మాడళ్లలో ఆరు మాన్యువల్ గేర్లు, ఇతర టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు వచ్చే దీపావళి నాటికి 1.8 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన మరో మాడల్‌ను కూడా తీసుకొస్తున్నది.
బెంజ్-వీ క్లాస్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..మరొకసారి వీ-క్లాస్ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. వచ్చేవారంలో విడుదల కానున్న ఈ కారు నాలుగేండ్ల క్రితం ఉపసంహరించుకున్నది. ఆరుగురు, ఎనిమిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారును పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో తీర్చిదిద్దింది. లెక్సస్ ఎల్ఎం, ఎంజీ ఎం9, టయోటా వల్ఫురైలకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను తీసుకొస్తున్నది.
ఆడీ ఎస్క్యూ8
జర్మనీకి చెందిన మరో సంస్థ ఆడీ..ఎస్క్యూ8 మాడల్‌ను వచ్చే నెల 17న అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 4.0 లీటర్ ట్విన్-టర్బో వీ8, ఆర్ఎస్ క్యూ8 తయారైన ఈ మాడల్ కేవలం 4.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ఈ మాడల్‌లో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్లు ఉన్నాయి.
స్కోడా కుషక్ ఫేస్ లిఫ్ట్
స్కోడా తన మాడల్ కుషక్ను మార్చి నెలలో విడుదల చేయబోతున్నది. డిజైనింగ్ పరంగా భారీ మార్పులు చేసిన ఈ మాడల్‌ను యువత కోరుకుంటున్న విధంగా తీర్చిదిద్దింది. పానోరామిక్ సన్‌రూఫ్, 115 హెచ్‌పీ 1 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ గేర్లను ఆటోమేటిక్‌గా మార్చుకునే అవకాశం ఉన్నది. దీంతోపాటు 150 హెచ్‌పీల శక్తినివ్వనున్న 1.5 లీటర్ టర్బో మాడల్‌లో 7 స్పీడ్ డీసీటీ గేర్లు ఉన్నాయి.
టయోటా మరో ఈవీ
దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టయోటా మరో ఈవీని విడుదల చేయడానికి సిద్ధమైంది. 49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో ఈ మాడళ్లను తయారు చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 440 కిలోమీటర్ల నుంచి 543 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. మారుతి ఇటీవల విడుదల చేసిన ఈ-విటారాకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నది.