హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలం గాణ): రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి తెస్తున్న అప్పులకు అంతం ఉండటం లేదు. ఈ నెలలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 14వ తేదీ నాటికే రూ.12,500 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్రెడ్డి సర్కార్.. తాజాగా మంగళవారం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.1,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 19 ఏండ్ల కాలపరిమితితో 7.65% వార్షిక వడ్డీకి ఈ అప్పు తీసుకున్నది.
ఈ నెలలో ఒక మంగళవారం మినహా మిగిలిన 4 మంగళవారాల్లో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణాలు సమీకరించింది. దీంతో ఈ నెలలో తెచ్చిన మొత్తం అప్పులు రూ.13,500 కోట్లకు, ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెచ్చిన మొత్తం అప్పులు రూ.32,400 కోట్లకు చేరాయి. ఒకే నెలలో, ముఖ్యంగా జూలైలో ఇంత భారీగా రుణాలు సమీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్ల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. జూలై-సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికంలో రూ.21,000 కోట్ల అప్పులు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. అందులో ఏకంగా రూ.13,500 కోట్లు జూలైలోనే సమీకరించింది. బహిరంగ మార్కెట్ రుణాల రూపేణా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల అప్పులు తెస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రేవంత్రెడ్డి సర్కార్.. ఆ లక్ష్యానికి మించి భారీగా రుణాలు సమీకరించింది.
2025-26లో ఏకంగా రూ.85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి మొత్తం రూ.80 వేల కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం 4 నెలల్లోనే రూ.32,400 కోట్ల అప్పులు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతాయని, తద్వారా రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
