Clay Ganesh | జహీరాబాద్, సెప్టెంబర్ 15: వినాయక చవితి అంటే కొత్త విగ్రహం కొనుక్కొచ్చి పూజలు చేయడం మాత్రమే కాదు.. మన చేతులతోనే పర్యావరణహిత గణపతిని తయారు చేసుకోవచ్చని ఓ ఆరో తరగతి చిన్నారి నిరూపించాడు. జహీరాబాద్ పట్టణంలోని రాచన్నపేట్ కాలనీకి చెందిన విద్యార్థి నితిన్ దేవదాసి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహం ఇప్పుడు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాచన్నపేట్ కాలనీకి చెందిన నితిన్ దేవదాసి శాంతినికేతన్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా విగ్రహం కొనుగోలు చేయకుండా.. తన సృజనాత్మకతకు పదును పెట్టి స్వచ్ఛమైన మట్టితో దాదాపు రెండు అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని స్వయంగా తయారు చేశాడు.
విగ్రహాన్ని పరిశీలిస్తే చిన్నారి చేసిన పనితనం స్పష్టంగా కనిపిస్తోంది. గణపతి ఆకృతి, ముఖ కవళికలు, అలంకరణలో చూపిన శ్రద్ధ ఆకట్టుకుంటున్నాయి. చిన్న వయసులోనే ఇంత చక్కటి విగ్రహాన్ని తయారు చేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నితిన్ తయారు చేసిన మట్టి గణపతిని కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో ప్రతిష్ఠించారు. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కూడా గణనాథుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మట్టి విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారి ప్రతిభను అభినందిస్తూ అతడిని ప్రోత్సహిస్తున్నారు. చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, గేమ్స్‌లో గడుపుతున్న ఈ రోజుల్లో.. నితిన్ మాత్రం తన సమయాన్ని సృజనాత్మకతకు కేటాయించి మట్టి గణపతిని తయారు చేయడం అభినందనీయమని కాలనీ వాసులు అంటున్నారు.
“ఆరో తరగతి చదివే వయసులోనే ఇంత పెద్ద గణపతి విగ్రహాన్ని సొంతంగా తయారు చేయడం గొప్ప విషయం. నితిన్‌లో మంచి కళా ప్రతిభ ఉంది. ఇలాంటి పిల్లలను ప్రోత్సహించాలి” అంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో.. సహజ మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేసి పూజించడం ద్వారా నితిన్ మంచి సందేశం ఇచ్చాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.