AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాన్-యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
దాంతో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఏపీపీఎస్సీతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుంది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ పదేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు విడుదలచేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే దాదాపు ఏడాదిపాటు చేపట్టే నాన్-యూనిఫామ్ పోస్టుల భర్తీకి ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది.
అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం సాధారణ కేటగిరీలో కేవలం రెండేళ్లపాటు వయోపరిమితిని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఇక ఇప్పటికే ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996’ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. అంటే.. పెంచిన 44 ఏళ్ల గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం మరో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఈ వయోపరిమితి పెంపు పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫామ్ పోస్టులకు, నిర్దిష్ఠ భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు వర్తించదు. అభ్యర్థులు ఆయా ఉద్యోగ ప్రకటనలలో పేర్కొన్న నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వయసు మీరుతోందని ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువత.. వయోపరిమితి పెంచాలని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లకు పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులతో చర్చించి ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగ యువతలో హర్షం వ్యక్తమవుతోంది. తమ విన్నపాన్ని మన్నించినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.