నిజాంసాగర్, సెప్టెంబర్ 14: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ ప్రాజెక్టులో స్నానం చేసేందుకు దిగి నీటిలో మునిగిపోయిన బాన్సువాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు సకాలంలో స్పందించి ప్రాణాలతో కాపాడారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాన్సువాడ ప్రాంతానికి చెందిన నలుగురు మిత్రులు ఆదివారం సాయంత్రం సరదాగా నిజాంసాగర్ ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చారు. అనంతరం ప్రాజెక్టు 16 వరద గేట్ల కింది భాగంలో లోతు అధికంగా ఉన్న ప్రాంతంలో స్నానం చేసేందుకు దిగారు. ఈ క్రమంలో వారిలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అదృశ్యమయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన మిగతా ముగ్గురు ఒడ్డుకు చేరుకుని కేకలు వేశారు.
అదే సమయంలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సహీద్తో పాటు మరో నలుగురు యువకులు ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చి అక్కడే ఉన్నారు. కేకలు విని వెంటనే అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. తమ మిత్రుడు నిజాంసాగర్ ప్రాజెక్టులో మునిగిపోయాడని బాధితుడి స్నేహితులు చెప్పడంతో సహీద్తో పాటు మరో యువకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి గాలింపు చేపట్టారు. ఇద్దరూ కలిసి నీటిలో గాలించగా మునిగిపోయిన యువకుడు కనిపించాడు. అప్పటికే అతను కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే అతడిని ఒడ్డుకు తీసుకొచ్చి సీపీఆర్ చేయడంతో పాటు నీటిని బయటకు కక్కించేలా సుమారు పది నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
నిజాంసాగర్ ప్రాజెక్టు 16 వరద గేట్ల కింది భాగంలో నీటి లోతు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. గత ఏడాది కూడా అచ్చంపేట గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఇదే ప్రాంతంలో నీటిలో పడి మృతి చెందిన సంఘటన జరిగింది.
తాజాగా ప్రమాద సమయంలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు అక్కడ ఉండటం, కేకలు విని సకాలంలో స్పందించడం, వారిలో ఇద్దరు నీటిలోకి దిగి యువకుడిని బయటకు తీసుకురావడం, అనంతరం సీపీఆర్ చేయడంతోనే అతని ప్రాణాలు నిలిచాయి. తన ప్రాణాలను కాపాడిన సయ్యద్ సైడ్ సహీద్తో పాటు మరో నలుగురు యువకులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.