హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర రైల్వే, సమాచార సాంకేతికశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఐటీరంగం, రైల్వే ప్రాజెక్టుల అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్నందున కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరామని వెల్లడించారు.
తాము ప్రతిపాదిస్తున్న రైల్వే డివిజన్లో కాజీపేట-బల్లార్ష, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు, మోతమర్రి- విష్ణుపురం, కాజీపేట-వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించినట్టు తెలిపారు. తెలంగాణ రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించినట్టు వివరించారు.
ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీనియర్ నేత జాన్సన్‌నాయక్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్ పరిధి సుమారు 2వేల ట్రాక్ కి.మీ. వరకు ఉంటుందని, రైల్వే ఉద్యోగ సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం 900 కి.మీ. పరిధితో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కి.మీ. విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట డివిజన్ ఏర్పాటు అనేది సముచిత నిర్ణయమని వివరించారు.
151 కి.మీ. మనోహరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల – వేములవాడ-కొత్తపల్లి న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వే ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని, అనంతరం నిలిచిపోయిన పనులను తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పునఃప్రారంభించిందని గుర్తుచేశారు. ఉచిత భూసేకరణ, రైట్ ఆఫ్ వే, నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం వంటి చర్యలతో పనులు వేగవంతం చేసి, మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 76 కిలోమీటర్ల రైల్వేలైన్ పూర్తి చేసి 2023 అక్టోబర్ 3న ప్రారంభించినట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కొత్తపల్లి మధ్య మిగిలిన 75 కిలోమీటర్ల పనులు మందగించాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన సుమారు రూ.416 కోట్లతోపాటు మరో రూ.511 కోట్ల నిధులు విడుదల కాకపోవడం, ఇంకా 96 హెక్టార్ల భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఈ కారణంగా మొదట రూ.1,160 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,780 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రాంత అభివృద్ధికి ఈ రైల్వే మార్గం అత్యంత కీలకమని తెలిపారు.
వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డాటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దృష్టి సారించే ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు కేటీఆర్ వెల్లడించారు. అదనంగా మరో టైర్-2 నగరంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ డిజైన్, డీప్ టెక్, ఎంటర్ప్రెన్యూర్ షిప్ రంగాలకు సంబంధించిన సెంటర్స్ ఆఫ్ లెక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర టైర్-2 నగరాలు ఉపాధి, ఆవిషరణలకు కేంద్రాలుగా మారి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. వీటిపై కేంద్రమంత్రి వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్టు వివరించారు.
సిరిసిల్ల, వేములవాడ రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునికీకరించాలని కేంద్రాన్ని కోరినట్టు కేటీఆర్ చెప్పారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలుపాలని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని పూర్తిగా విద్యుదీకరించాలని విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. ఎస్సీఆర్ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ప్రత్యేక హై-లెవల్ కమిటీ ఏర్పాటుచేసి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. పీఎం గతిశక్తి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరినట్టు తెలిపారు.
రైల్వే అంశాలతోపాటు తెలంగాణలోని టైర్-2 ఐటీ నగరాల అభివృద్ధి విషయాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు కేటీఆర్ తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించే దిశగా చర్యలు చేపట్టిందని చెప్పారు. రూరల్ టెక్నాలజీ సెంటర్స్, గ్రిడ్ విధానాల ద్వారా దాదాపు 50 వేల సాంకేతిక ఉద్యోగాల లక్ష్యంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఆధునిక ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రెండున్నరేండ్లుగా జిల్లాల్లో ఐటీ విస్తరణ మందగించడం, ఐటీ టవర్ల ఆక్యుపెన్సీ తగ్గడం, కొన్ని సంస్థలు కార్యకలాపాలు తగ్గించుకోవడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, అవి అధికారిక గణాంకాలేనని చెప్పారు.