సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది. తాజాగా రోడ్డు సెస్ పేరుతో అదనంగా రూ.2 వేల నుంచి 10 వేల వరకు డబ్బులు వసూలు చేయడానికి సిద్ధమైంది. ఆదివారం నుంచి రోడ్డు సెస్ పన్ను అమల్లోకి రానున్నది. దీంతో వాహనం కొనుగోలు చేయాలంటే సామాన్యులు ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది.
వాహనాల ధరలు పెరిగితే పరోక్షంగా ప్రయాణికులపైన కూడా భారం పడనున్నది. కాగా, ఏదైనా ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే.. ఆ బండి ధర రూ. 1.10 లక్షలు ఉంటే ఇప్పుడు సెస్‌తో 1.12 లక్షలు అవుతుంది. కారు ధర రూ. 5 లక్షలు ఉంటే ఇప్పుడు 5.10లక్షలు అవుతుంది. ఈ రోడ్డు సెస్‌తో సామాన్యులు వాహనం కొనాలంటే దడ పుడుతుంది.
ఈఎంఐ డౌన్ పేమెంట్ ధరలు సైతం పెరగనున్నాయి. రోడ్డు సెస్ విధించిన సర్కార్ ఇతర పన్నులను తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.20 లక్షలు దాటిన ఏ వాహనానికైనా 18 శాతం లైఫ్‌ట్యాక్స్ ఉండగా రేవంత్ సర్కార్‌లో 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉన్న వాహనంపై 20 శాతానికి పన్ను పెంచింది. 50 లక్షలకు పైగా విలువజేసే వాహనంపై 21 శాతంగా వసూలు చేస్తున్నది.
అందుకోసం గతంలో నాలుగు శ్లాబులుగా లైఫ్ టాక్సీ ఇప్పుడు అదనంగా మరో శ్లాబు చేర్చి పన్ను భారం మోపింది. ఈ పెరిగిన పన్ను ధరలు వాహన కాలపరిమితి ఆధారంగా ఉండనున్నాయి. మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల ధరలను సైతం పెంచి సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో 9999 దక్కించుకోవాలంటే రూ. 50వేల ఫీజు చెల్లించి ఆపై బిడ్డింగ్‌లో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ 9999 నెంబర్‌ను దక్కించుకోవాలంటే 1.50లక్షల ఫీజు చెల్లించాల్సిందే.