Marri janardhan reddy | నాగర్ కర్నూల్ జిల్లా, జనవరి 29: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో ప్రజాపాలన కాదు, నోటీసుల పాలన, డైవర్షన్ పాలన, కక్ష్య సాధింపు పాలన నడుస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని ఆరోపించారు.
బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రామా ఆడుతున్నారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం అంతా ఉంది. మీ కేసులకు, నోటీసులకు భయపడేది లేదు.. అక్రమ కేసులపై ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ తేల్చుకుంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలనను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధం అయ్యారన్నారు.