– రిజిస్ట్రార్‌కు వర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ వినతి
రామగిరి, మార్చి 06 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డికి యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధనాభిలాషులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా NET, SET, JRF అర్హతలు సాధించిన విద్యార్థులు పీహెచ్డీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
అర్హతలు సాధించినప్పటికీ యూనివర్సిటీ నోటిఫికేషన్ లేకపోవడంతో వారు తమ పరిశోధన ప్రయాణాన్ని ప్రారంభించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు ఇప్పటికే పీహెచ్డీ నోటిఫికేషన్లు విడుదల చేసి అడ్మిషన్లు చేపడుతున్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ కూడా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ యూనివర్సిటీ నాయకులు సిద్దు, అరుణ్, శంకర్ పాల్గొన్నారు.