హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao ) ఆగ్రహం
వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ ప్లాన్ ( Diversion Plan ) డ్రామాకు తెర తీశారని ధ్వజమెత్తారు. ప్రచార కోసమేనని, ప్రజలకు ఒరిగేదేమి లేదని అన్నారు.
800 రోజుల పాలనలో చేసిందేం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరతీసిండని ఆరోపించారు.రెండున్నరేండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా?అంటూ నిలదీశారు.అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ అని విమర్శించారు.
ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల సంగతేమిటి ?
గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటని అన్నారు.
రెండున్నరేండ్లలో అసలు ఏం చేసారని ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి?గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ పైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా?కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు లేదు.గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేసారు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారు.నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు.
జాబ్ లెస్ క్యాలెండర్ ?
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు.
నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యుటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయని హరీష్రావు విమర్శించారు.
యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారని దుయ్యబట్టారు .అందని గ్యారెంటీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పాలని,సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప, ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న మీ గారడీలను ప్రజలు గమనిస్తున్నారని, దుర్మార్గ పాలనను నిలదీసేందుకు గ్రామ గ్రామాన ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.