కల్వకుర్తి, ఆగస్టు 1 ; కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు అరిగోస పడ్తున్నారు. వీరి పరిస్థితి ‘మూలిగే నక్కపై తాడిపండు పడ్డ’ చందంగా తయారైంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు సరఫరా చేసే ఎరువులపై ఉచిత రవాణాను ఎత్తేసింది. ఈ మేరకు సర్కార్ నుంచి పీఏసీసీఎస్లకు ఉత్తర్వులు అందాయి. ఇకపై బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విధంగానే ఎరువులను సహకార సంఘంలో అదే ధరకు కొనాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించాయి. ఎరువుల రవాణా ఖర్చులు రైతులే భరించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎరువుల ఉచిత రవాణా నుంచి తప్పుకోవడంపై కర్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ రై తులకు ఆదెరువుగా ఉంటాయి. సింగిల్ విండో పద్ధతిన బ్యాంక్ పనిచేస్తుండడంతో రైతులకు అన్ని విధాలా మేలు చేకూరుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి విత్తనా లు, ఎరువులు, రుణాల పంపిణీ వరకు పీఏసీసీఎస్లు రైతులకు అండగా ఉన్నాయి. ఎరువుల పంపిణీలో వీ టికి ప్రత్యేకత ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండల కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సహకార సంఘాల నుంచి ఎరువుల తీసుకునేవారు. వీటి రవాణా బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఎరువుల రవాణాకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేది. ప్రసుత్తం ప్రభుత్వం ఎరువుల రవాణా ఖర్చులను ఎత్తివేసింది. సదరు చార్జీలను ఆయా పీఏసీసీఎస్లే భరించుకోవాలని జీవో విడుదల చేసింది. దీంతో ఎరువుల రవాణా ఖర్చుల భారం రైతులపైనే పడనున్నది. ఇక నుంచి బహిరంగ మార్కెట్లో ఎరువుల విక్రయించిన విధంగానే పీఏసీసీఎస్లు కూడా ఎరువులు విక్రయించాల్సి వస్తుంది.
బహిరంగ మార్కెట్లో..
బహిరంగ మార్కెట్లో యూరియా ధర విషయానికి వస్తే బస్తా ఒకటి రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. అదే పీఏసీసీఎస్‌లో అయితే రూ.266కి విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్‌కు, పీఏసీసీఎస్కు మధ్య బస్తాకు రూ.34 నుంచి రూ.50 వరకు తేడా ఉంది. బహిరంగ మార్కెట్లో డీలర్లు రవాణా ఖర్చుల పేరిట ఎక్కువ ధర తీసుకుంటారు. అదే పీఏసీసీఎస్‌లో అయితే రవాణా ఖర్చులు ఏమీ ఉండవు. ఉదాహరణగా గత వానకాలం నుంచి ఇప్పటి వరకు కల్వకుర్తి పీఏసీసీఎస్‌లో 33 వేల బస్తాల ఎరువులను విక్రయించారు. రవాణా ఖర్చుల భారం లేకుండా విక్రయించడంతో రైతులకు దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా అయ్యింది. కేవలం ఇది ఒక్క కల్వకుర్తి పీఏసీసీఎస్లోనే. అదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే రూ. కోట్లలో ఉంటుంది.
రవాణా చార్జీలు ఎత్తేయడంపై నిరసనలు
ప్రభుత్వం ఎరువుల రవాణా చార్జీలను ఎత్తివేయడంతో ఎరువు బస్తాకు రూ.30 నుంచి రూ.50 అదనంగా భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎరువుల ధరలు భారీగా పెరిగాయని, ఇప్పుడు ప్రభుత్వం పీఏసీసీఎస్‌ల ద్వారా సరఫరా చేసే ఎరువుల చార్జీలను ఎత్తివేయడంతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయం నరకంలా మారిందని, సాగుకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఎరువుల రవాణా చార్జీలను యథావిధిగా ప్రభుత్వమే భరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులపై ఎందుకంత వివక్ష..
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ రైతులపై వివక్ష ప్రదర్శిస్తున్నది. రైతులకు ఎప్పుడు పూర్తి స్థాయిలో అండగా ఉండటం లేదు. రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వదు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో విపరీతమైన కొర్రీలు. మిల్లర్లు క్వింటా వడ్లకు 10 కిలోలు తరుగుతీసినా పట్టించుకోరు. ఇప్పుడేమే పీఏసీసీఎస్‌ల ద్వారా సరఫరా అయ్యే ఎరువుల బస్తాల రవాణా చార్జీలను ఉపసంహరించుకుంది. బస్తా ఎరువుకు అదనంగా రూ.50 వరకు భరించాల్సి వస్తుంది. వ్యవసాయం చేయడం కన్నా ఎక్కడికైన వెళ్లి కూలీ పనులు చేసుకోవడం మంచిదని పిస్తుంది. ఇలాంటి ఖర్చులతో కూడిన పంటల సాగు చేసి అప్పుల పాలు కావడం కంటే పక్క రాష్ర్టాలకు బతుకు దెరువుకు పోవడం మంచిది. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది.
– సిమ్ముల వెంకట్‌రెడ్డి, రైతు, సిలార్పల్లి
పీఏసీసీఎస్లను నిర్వీర్యం చేస్తారేమో?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పీఏసీఎస్‌లపై శీతకన్ను వేసింది. ప్రసుత్తం సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న రైతుల ఓట్లతో డైరెక్టర్లు, చైర్మన్లు ఎన్నికవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఆలోచనలకు తెరలేపింది. నామినేటెడ్ పద్ధతిన పీఏసీసీఎస్లకు చైర్మన్లను నియమిస్తారట. ఇప్పటికే ప్రభుత్వాల సహకారం పూర్తి స్థాయిలో లేక ఇబ్బందులు పడుతున్న సంఘాలు నామినేటెడ్ పదవులు పంపకంతో మరింత దివాళా తీసే ప్రమాదం ఉన్నది. అందులో భాగంగానే ఎరువుల రవాణా చార్జీలను సర్కార్ ఉపసంహరించుకున్నది. ఆ భారం ఖచ్చితంగా రైతులపైనే పడుతుంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో తల్లడిల్లుతున్న రైతాంగం మరింత ఇబ్బందికి గురవవుతారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎరువుల రవాణా చార్జీలను భరించాలి.
– తలసాని జనార్దన్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్, కల్వకుర్తి