మక్తల్ : వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మక్తల్ రైతులు మినీ ట్యాంక్ బండ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా ( Farmers Protest ) కు దిగారు.

ఆదివారం మక్తల్ మండల పరిధిలోని మంతన్ గౌడ్ సబ్ స్టేషన్ ఫీడర్ లో విద్యుత్ లో వోల్టేజీ ( Low voltage ) సమస్యతోపాటు, సక్రమంగా విద్యుత్ రాక చేతికి వచ్చిన వరి పంట ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మంతన్ గౌడ్, రుద్రసముద్రం, కాట్రేవపల్లి, కాచ్ వార్, దండు, గొల్లపల్లి, టేకులపల్లి గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు.
ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) మద్దతు తెలిపి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు సంబంధిత ఎస్ఈ తో మాట్లాడారు.
మండలంలో వ్యవసాయానికి కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని, బోర్ల వద్ద సాగు చేసుకున్న రైతుకు 100 శాతం దిగుబడి వచ్చే విధంగా, నిరంతరం కరెంటు సరఫరా అందించాలని కోరారు. జాతీయ రహదారిపై ధర్నాతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.