హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1) సందర్భంగా తెలంగాణలోని చేయూత పెన్షన్దారులకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వయోవృద్ధుల నెలవారీ పెన్షన్ను రూ.2,016 నుంచి రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా ఇది అమలుకాలేదు. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా రూ.4,000 ఇస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుతుందా? అని వృద్ధులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వయోవృద్ధుల పెన్షన్ అర్హత వయసును 2014లో ఉన్న 65 ఏండ్ల్ల నుంచి 2022 నాటికి 57 ఏండ్లకు తగ్గించారు. 2014లో రూ.1,000గా ఉన్న నెలవారీ పెన్షన్ను 2022 నాటికి రూ.2,016కు పెంచారు. దసరా నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వబోతుండగా, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతున్నది. గతంలో వయోవృద్ధులు, ఒంటరి మహిళలు సహా మొత్తం 11 క్యాటగిరీల్లో పెన్షన్లు అందించేవారు. అయితే, ఇప్పుడు వయోవృద్ధులు, బీడీ కార్మికులు సహా నాలుగు క్యాటగిరీలను ఈ దరఖాస్తు ప్రక్రియ నుంచి పకనపెట్టారు. దీనివల్ల కొత్తగా అర్హులైన వృద్ధులు పెన్షన్ పథకంలో పేర్లు నమోదు చేసుకోలేకపోతున్నారు.
గణనీయంగా తగ్గిన లబ్ధిదారుల సంఖ్య
ఒకవైపు కొత్త పెన్షన్లు అందక, రూ.4,000 పెంపు రాక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు లబ్ధిదారుల జాబితా నుంచి చాలామంది పేర్లు తొలగిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నది. 2023 నాటికి రాష్ట్రంలో రూ.2,016 పెన్షన్ పొందుతున్న వయోవృద్ధుల సంఖ్య 16.44 లక్షలు కాగా, అది ఇప్పుడు 14.65 లక్షలకు పడిపోయింది. 2026 జూలై 30 నాటికి లబ్ధిదారుల సంఖ్య తగ్గడానికి అధికారులు పలు కారణాలను వెల్లడించారు. మరణాలు 76,372 మంది, అడ్రస్ లభించనివారు 45,134 మంది, ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు 6,064 మంది, పెన్షన్ నిరాకరించినవారు 1,248 మంది ఉన్నారని పేర్కొన్నారు. హామీ ప్రకారం వెంటనే రూ.4,000 పెన్షన్ను అమల్లోకి తెచ్చి, చేయూత పథకం ద్వారా కొత్త దరఖాస్తులను ఆహ్వానించాలని వయోవృద్ధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.