ప్రయాగ్‌రాజ్, అక్టోబర్ 1: నిందితుడు లొంగిపోయేలా ఒత్తిడి తెచ్చేందుకు ఆ వ్యక్తి కుటుంబంలోని నిర్దోషులైన సభ్యులను పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించకూడదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. అటువంటి నిర్బంధం చట్టవిరుద్ధంగా స్వేచ్ఛను హరించడమేనని, దీనివల్ల నిర్బంధానికి గురైన వ్యక్తి పరిహారం పొందేందుకు అర్హులవుతారని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ దినేశ్ చంద్ర సామంతతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల జార్జ్ టౌన్ పోలీసు స్టేషన్లో పిటిషనర్ అరవింద్ కుమార్ యాదవ్‌ను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కోర్టు విచారణకు అనుమతించింది.
అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిర్బంధించినందుకు పిటిషనర్‌కు రూ.40,000 పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ అక్రమ నిర్బంధానికి బాధ్యులైన పోలీసు సిబ్బంది జీతాల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలనిధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ సోదరుడు సురేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. తన సోదరుడిపై నమోదైన కేసుతో తనకు సంబంధం లేనప్పటికీ పోలీసులు నిర్బంధించినట్టు పిటిషనర్ తెలిపారు.