హైదరాబాద్ అక్టోబర్ 1 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నదని, ఆయన పార్టీకి బలం కాకుండా భారంగా మారుతున్నారని ‘ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ’ (ఇండియన్ అమెరికన్స్ ఫోరం) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాసింది. ఒక జాతీయ సదస్సులో రేవంత్‌రెడ్డి స్వయంగా తాను ఏబీవీపీ నేపథ్యం కలవాడినని చెప్పుకోవడమే కాకుండా, నరేంద్రమోదీ నాలుగోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లేఖలో ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకొని రేవంత్‌రెడ్డిని సరిదిద్దడమో లేదా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించడమో చేయాలని డిమాండ్ చేసింది.
సైద్ధాంతిక పోరాటానికి విరుద్ధమైన వైఖరి
ఒకవైపు రాహుల్‌గాంధీ ’భారత్ జోడో యాత్ర’ ద్వారా ఆరెస్సెస్, ఏబీవీపీ, సంఘ్ పరివార్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్ నియమించిన ముఖ్యమంత్రి అదే వేదికలను కించపరిచేలా వ్యవహరించడం శోచనీయమని ‘ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ’ ఎత్తిచూపింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏబీవీపీ భావజాలంపై తాము యుద్ధం చేస్తుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం బహిరంగంగా తన పాత ఏబీవీపీ గుర్తింపును సమర్థించుకోవడం కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేసింది. రేపటి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రే మోదీని మళ్లీ గెలిపించాలని కోరుకుంటున్నారంటూ బీజేపీ ఈ వ్యాఖ్యల క్లిప్పును ప్రచార అస్త్రంగా మార్చుకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
2029 లక్ష్యానికి గొడ్డలిపెట్టు
ఈ పరిణామం కేవలం తెలంగాణకే పరిమితం కాదని, 2029 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ నిర్మిస్తున్న సైద్ధాంతిక వైఖరికే గొడ్డలిపెట్టుగా మారుతుందని ‘ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ’ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక సంఘ్ నేపథ్యం ఉన్న నేతను ముందుంచి దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్‌తో పోరాడటం సాధ్యం కాదని, ఇది పార్టీలోని అసలైన కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీ స్తున్నదని లేఖలో రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణలో పాలనాపరమైన వైఫల్యాలు కూడా పెరుగుతున్నాయని లేఖలో ఆరోపిస్తూ, పరిస్థితి చేయిదాటిపోకముందే పార్టీ నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.