సూర్యాపేట టౌన్, జనవరి 29 : విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల సమాజాన్ని జాగృతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, నియమ నిబంధనలు పాటించడం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. విద్యార్థులు నిరంతరం కష్టపడి చదువుకుని ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల తల్లిదండ్రులను, స్థానికులను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.
ప్రమాద రహిత జిల్లాగా సూర్యాపేటను చూపించడం అందరి బాధ్యత అన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం అతివేగాన్ని నివారించడం వంటి పోస్టర్లను విద్యార్థులతో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం పట్టణ ముఖ్య కూడల్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలంటూ వాహనాలకు స్టిక్కర్లను అంటి పెడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదిత్య, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎమ్మెస్సార్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Suryapet Town : రోడ్డు భద్రత పట్ల సమాజాన్ని జాగృతం చేయాలి : ఎస్పీ నరసింహ