Digestive System | తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తాజా పండ్లు, కూరగాయలు పొట్టలో మైక్రోబయోమ్ పై, శరీరం మొత్తం మెటబాలిక్ ఆరోగ్యంపై ఎలా ప్రభావాన్ని చూపుతాయో చాలా మందికి తెలియదు. శరీరంలో ఇతర అవయవాలపై ఏవిధంగా శ్రద్ద చూపిస్తామో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై కూడా అదేవిధంగా శ్రద్ద చూపించడం చాలా అవసరం. జీర్ణవ్యవస్థను రెండవ మెదడు అని కూడా పిలుస్తూ ఉంటారు. జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మొత్తం శరీర శ్రేయస్సును పెంపొందిస్తుంది. చాలా మంది తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన ఆహారం పొట్టలో మంచి బ్యాక్టీరియా శాతాన్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని, పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచే అనేక రకాల పండ్లు, కూరగాయలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల పండ్లు, కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ఒక ప్రీబయోటిక్ ఫైబర్. పొట్టలో మంచి బ్యాక్టీరియాకు ఇది ఆహారంగా పని చేస్తుంది. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా సమతుల్యంగా ఉంటుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అరటి పండ్లను తీసుకోవడం ద్వారా కూడా పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వీటిల్లో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్ గా పని చేస్తుంది. పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇది దోహదపడుతుంది. అరటిపండ్లను తీసుకోవడం వల్ల పేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. మలబద్దకం సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. సున్నితమైన పొట్ట ఉన్న వారు అరటిపండ్లు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఆకుకూరలు కూడా పుష్కలంగా ఫైబర్ ను, యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్లను కలిగి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో మంట తగ్గుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం జీర్ణవ్యవస్థలోని కండరాలు సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.
ఇక చిలగడదుంపల్లో కూడా కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో బీటా కెరోటిన్, ఆంథోసైనిన్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. చిలగడదుంపలను తీసుకోవడం వల్ల పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదల చక్కగా ఉంటుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్ గా పని చేస్తుంది. చిలగడదుంపలో ఉండే ఫైబర్, స్టార్చ్ మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇవి పొట్టలో వాపును తగ్గించి మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే క్యారెట్ లలో ఫైబర్ తో పాటు బీటాకెరోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. పొట్టలో వాపును తగ్గించడంలో, రోగనిరోధకత శక్తిని పెంచడంలో ఇవి దోహదపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ లైనింగ్ ను దెబ్బతినకుండా కాపాడడంలో క్యారెట్ లు ఎంతో సహాయపడతాయి.
అవకాడోలు ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రీబయోటిక్ సమ్మేళనాలతో ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్ ను పెంచడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి అవకాడోలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ప్రీబయోటిక్ సమ్మేళనాలు గట్ బ్యాక్టీరియాను పోషించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా తాజా పండ్లు, కూరగాయలు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయని పొట్ట ఆరోగ్యం బాగుంటేనే శరీరం మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కనుక శరీరానికి హానిని కలిగించే జంక్ ఫుడ్ కు బదులుగా అందరూ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.