High BP Diet | మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రక్తపోటు బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నారు. ఒక్కసారి రక్తపోటు సంబంధిత మాత్రలు వాడడం మొదలు పెడితే వాటిని జీవితాంతం వాడాల్సిందే. అలాగే రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ లు వచ్చే అవకాశాలను పెంచుతుంది. కనుక రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు ఈ సమస్య బారిన పడకుండా ఎవరిని వారు కాపాడుకోవాలి. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల రక్తపోటును సులభంగా తిప్పికొట్టవచ్చు. అలాగే ఈ మార్పులు రక్తపోటు బారిన పడకుండా కాపాడడంలో కూడా ఎంతో సహాయపడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో చేసుకోదగిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ 30 నుండి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉండాలంటే శరీర బరువు అదుపులో ఉండడం కూడా చాలా ముఖ్యం. కనుక క్రాష్ డైట్స్ వంటి వాటితో కాకుండా ఆరోగ్యంగా బరువు తగ్గేలా చూసుకోవాలి. అలాగే చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోవడం మానేయడం ద్వారా కూడా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోవడం తగ్గించాలి. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటుతో బాధపడే వారు అరటిపండ్లు, చేపలు, పాలు, చిలగడదుంపలు వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇటువంటి ఆహారాలు రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అయితే మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు మాత్రం పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అలాగే ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తపోటును పెంచుతాయి. కనుక వీటికి కూడా దూరంగా ఉండడం మంచిది. ధూమపానం కారణంగా కూడా రక్తపోటు పెరుగుతుంది. ధూమపానాన్ని మానేయడం వల్ల హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటుకు కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. కనుక ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవాలి. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే డార్క్ చాక్లెట్ కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ లో 60 శాతం కోకో ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ టీ, సెలెరీ జ్యూస్ వంటివి కూడా రక్తపోటును తగ్గించడంలో దోహదపడతాయి. అల్లం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి తెలిసిందే. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు రక్తపోటును తగ్గించడంలో కూడా అల్లం సహాయపడుతుంది.
నిద్రలేమి కూడా రక్తపోటును పెంచుతుంది. కనుక రోజూ 6 నుండి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర పోయేలా చూసుకోవాలి. పచ్చి వెల్లుల్లిని లేదా వెల్లుల్లి పొడి తీసుకోవడం ద్వారా కూడా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు గుడ్లు, గింజలు, శనగలు వంటి ఆహారాలు కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఆల్కహాల్ ను తీసుకోవడం మానేయడం ద్వారా కూడా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. కూరగాయలు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్లు, చికెన్, తృణ ధాన్యాలు వంటి ఆహారాలు మెగ్నీషియంను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా రక్తపోటును తగ్గించుకోవచ్చు. బెర్రీ జాతికి చెందిన పండ్లల్లో పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటు హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తగిన ఆహారాలను తీసుకుంటూ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు రక్తపోటు బారిన పడకుండా ఎవరిని వారు కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలను పాటించినప్పటికి రక్తపోటు అదుపులో ఉండకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.