టోక్యో: జపాన్‌లో పెళ్లి కాని వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 30 ఏళ్ల లోపు ఉన్న 60 శాతం మంది పెళ్లికాని యువత(Unmarried Adults) పిల్లలు వద్దనుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌పై ఫోకస్ వల్ల పిల్లలు కనేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఆ దేశ ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ ఇటీవల ఈ సర్వే చేపట్టింది. ఆన్లైన్ ద్వారా రోటో ఫార్మసీ కంపెనీ ఈ సర్వే నిర్వహించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లి కాని మహిళలు, పురుషుల నుంచి గత ఏడాది డిసెంబర్లో సర్వే వివరాలు సేకరించారు. ప్రెగ్నెన్సీ, ఫ్యామిలీ ప్లానింగ్‌లో భాగంగా ఆ ఫార్మసీ కంపెనీ ఈ సర్వే చేపట్టింది. పిల్లలు కనేందుకు ఇష్టపడని వారి సంఖ్య 2025లో 62.6 శాతానికి చేరుకున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. అయితే 2020 నాటి సర్వేతో పోలిస్తే ఆ సంఖ్య 18 శాతం పెరిగినట్లు అంచనా వేశారు.