– ఇది కాలం తెచ్చిన కరువు కాదు- కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు
గుర్రంపోడు, సెప్టెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రంలో ఎర్పడిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం గుర్రంపోడు మండలంలోని వెంకటాపురం(కె) గ్రామంలో బల్గూరి లింగయ్య, మంటిపల్లి లింగయ్య, ఎరుకల భిక్షం రైతులకు చెందిన ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. నాగార్జునసాగర్ జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికి ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిని పొదుపుగా వాడేందుకు సాగర్ ఎడమ కాలువకు వారబంది ప్రకారం నీటిని విడుదల చేసేవాళ్లమని గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల చౌర్యానికి పాల్పడిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంతమైన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను తీసుకుపోయాడు కానీ శ్రీశైలం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ కు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను తీసుకురాలేక పోయిందన్నారు.
మండలంలో రైతులు ఆరుగాలం కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి వేసిన పంటలు ఎండిపోతున్నాయాని అన్నారు. ప్రభుత్వం మాత్రం సాగునీరు ఇచ్చి పంటలను కాపాడేందుకు చోద్యం చూస్తుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతులకు ప్రభుత్వం సరిపోనూ కరెంటు ఇవ్వడం లేదన్నారు. రైతు ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో పంటలు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సాగర్ ఎడమ కాల్వతో పాటు ఎస్ఎల్బీసీకి హై లెవెల్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలన్నారు. పంట పొలాలను కాపాడేందుకు వారబందీ ప్రకారం నీటి విడుదల చేయాలని, వెంటనే వారబంధి నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నీటి విడుదల చేసి పంటలను కాపాడకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేపడుతామన్నారు.
గ్రామాలలో పొలాలు ఎండిపోతున్నాయని దీనికి రాష్ట్ర భారీ నీటి పాడుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుంట పొలం ఎండిపోయిన అందుకు ఉత్తమ్ బాధ్యత వహించాలని అన్నారు. ఉత్తమ్ కు వ్యవసాయం మీద కానీ, నీటి పారుదల శాఖపై గానీ అవగాహన లేదని, కమీషన్లు తీసుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనంజయ, మాజీ ఎంపీపీ సామల బోజ్జయ్య, సర్పంచులు జక్కల స్వప్నభాస్కర్, సింగం బాలకృష్ణ, అందుగుల శ్రీను, చెవు రమేష్, సల్వాది సరస్వతి నగేష్, మాజీ సర్పంచులు పోలె రాములమ్మ రామచంద్రం, కామల్ల రేవతి నర్సింహా, మండల నాయకులు కామల్ల రాములు, కూనూరు సైదిరెడ్డి, సింగం ప్రవీణ్ కుమార్, నాగులవంచ నాగేశ్వరరావు, దోటి గణేష్, షేక్ సిరాజ్, చింత రెడ్డి రవీందర్ రెడ్డి, తీరం దాస్ అంజయ్య, మర్ల రమేష్, వనమాల మహేందర్, కుందారపు యాదగిరి, భూపతి రాజు, అనిల్, అశోక్ పాల్గొన్నారు.