Harshavardhan Reddy : కొల్లాపూర్ జూన్ 17 : నియోజవర్గంలోని ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy) అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలతో నియోజవర్గంలోని కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్(CMRF) ఎల్ఓసీల కోసం అధికార పార్టీ నాయకుల వద్దకు వెళితే.. పార్టీలో చేరితేనే సీఎంఆర్ఎఫ్ అందిస్తామంటూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిలను అందించానని, వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా అండగా నిలిచానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంగళవారం MNJ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోడేరు మండల కేంద్రానికి చెందిన బాలనాగయ్య కుమారుడు మాస్టర్ యశ్వత్ను హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
‘నేను అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాల’ని బాధిత కుటుంబానికి ఆయన మనో ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి యశ్వంత్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని పార్టీ కార్యకర్తలు అందరికీ మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.