వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తమ ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం బలవంతంగా భూములను గుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములను కూడా సేకరించాలని నిర్ణయించింది. దీన్ని సదరు గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి కాళ్లపూర్, రాపోల్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పరిగి ఎమ్మెల్యేగా రామ్మోహన్‌రెడ్డిని గెలిపిస్తే తమను రోడ్డుపాల్జేస్తున్నారని మండిపడ్డారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో బాధిత రైతులు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. రెండు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు తమకు ఇండస్ట్రియల్ పార్కు వద్దని, అందుకోసం తమ భూములు ఇచ్చేది లేదని వినతిపత్రాలు అందజేశారు.
భూములు గుంజుకుంటే రోడ్డున పడ్తం
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములివ్వం. ప్రభుత్వం భూములను బలవంతంగా గుంజుకుంటే రైతుల కుటుంబాలు రోడ్డునపడతాయి, ఊర్లు వదిలి వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తది. ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు చేస్తాం. మా భూముల వద్దకు ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. – సోమగారి జంగయ్య, మాజీ సర్పంచ్, కాళ్లపూర్