Kombucha Tea | రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అధికంగా తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే టీ, కాఫీలు ఇంకా ఎక్కువగా తాగుతారు. అయితే టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలను తాగితే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని, దీంతోపాటు టీ, కాఫీ తాగిన ఫీలింగ్ కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మనకు తాగేందుకు అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొంబుచా టీ కూడా ఒకటి. టీ, చక్కెర, బ్యాక్టీరియా, ఈస్ట్‌ను కలిపి పులియబెట్టి ఈ టీ పొడిని తయారు చేస్తారు. దీన్నే కొంబుచా టీ అంటారు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంబుచా టీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వారు అంటున్నారు.
కొంబుచా టీ అంటే పులియబెట్టబడింది కనుక ఈ టీని సేవిస్తే ప్రోబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అంటే ఈ టీ మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. మలబద్దకం తగ్గిపోతుంది. విరేచనాలు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్యలు ఉన్నవారు కొంబుచా టీని సేవిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. కొంబుచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఈ టీని సేవిస్తుంటే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, వయస్సు మీద పడడం వల్ల వచ్చే జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.
కొంబుచా టీ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ ఈ టీని తాగుతుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో లివర్‌లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ టీ ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా మద్యం కారణంగా వచ్చిన ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. కొంబుచా టీని తాగితే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
ఈ టీని తాగుతుంటే షుగర్ లెవల్స్ సైతం తగ్గిపోతాయి. కొంబుచా టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొంబుచా టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ టీ బరువును కూడా తగ్గించగలదు. దీన్ని తాగితే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని డైట్లో కచ్చితంగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా కొంబుచా టీని రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.