కొత్తగూడెం అర్బన్, జూన్ 17 : గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల (SHGs) మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సీహెచ్ అనురాధ అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సభ్యులకు పలు అంశాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ అఫ్ ఇండియా – ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వ నిర్వహిస్తున్న రైసింగ్ అండ్ యాక్సలెరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఔత్సాహిక మహిళలకు 15 రోజుల పాటు పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళుకువలు అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించనున్నట్టు తెలిపారు. పరిశ్రమలకు రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సహాయం కూడా ఇప్పించడం జరుగుతుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అలీప్ కమిటీ సభ్యురాలు పద్మావతి, అన్నపూర్ణ, ప్రోగ్రామ్.కో ఆర్డినేటర్ భరత్ రెడ్డి పాల్గొన్నారు.
Kothagudem Urban : పరిశ్రమల నిర్వహణపై మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన