KTR | ఫార్ములా-ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలన్న ఏసీబీ అంశంపై ఆయన న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమికంగా కేటీఆర్ న్యాయవాదులు పేర్కొనదాన్ని ప్రకారం.. ప్రస్తుతం నడుస్తున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించింది కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికారుల యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ నిర్ణయానికి మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారు.
ఫార్ములా-ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్పా.. వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ వేధింపుల కోణంలో మొబైల్ ఫోన్ అడగడం వెనుక న్యాయసమతమైన కారణాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు.
విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరుడిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని న్యాయవాదులు గుర్తు చేశారు. పైగా వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా.. వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాక, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందన్నారు. ఈ చట్టాల ప్రకారం కేవలం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్టాప్ లాంటి పర్సనల్ డివైజ్లు అడగవచ్చని వివరించారు. అంతేకాక, ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఎలాంటి నిధుల దుర్వినియోగం లేకుండా, స్కామ్ లేని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోందని స్పష్టంగా పేర్కొన్నారు.