కాచిగూడ,మార్చి 9: రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపు విషయంలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై బీసీ డెమోక్రటిక్స్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్ అధ్యక్షతన, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాచిగూడ అభినందన్ హోటల్లో నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ, ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీ ఎస్ రాములు, చెరుకు సుధాకర్, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలు రోడ్డుపై ఉద్యమాలు చేస్తేనే ప్రభుతాలు దిగివచ్చి, సమస్యలు పరిష్కరిస్తాయని వెల్లడించారు. అసెంబ్లీలో అగ్రవర్ణాల ఆధిప్యతం పెరిగిందని పేర్కొన్నారు. బీసీలను పల్లకి మోసే కూలీలుగా అగ్రవర్ణాలు చూస్తున్నాయని, అందుకే ఐక్యమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బీసీ వాదం బలంగా ఉందని, ఆ నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. బీసీ ఉద్యమం ప్రజల గుండెల్లో ఉన్నదని, రానున్నది బీసీల రాజ్యమేనని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అగ్రవర్ణాల చేతుల్లో పెట్టొద్దని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి, ఎర్ర సత్యనారాయణ, నందగోపాల్, ఉదయ్‌నేత, దిడ్డి రాంబాబు, శివమ్మ, హరితిలక్సింగ్, వివిధ సంఘాల బీసీ నాయకులు పాల్గొన్నారు.