Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఆదివారం జరిగిన మహిళల 48 కిలోల విభాగంలో సత్తా చాటిన మీరాబాయి అగ్రస్థానంలో పసిడి వెలుగులు విరజిమ్మింది. ఆసియా క్రీడలే తన అసలైన లక్ష్యమని, కామన్వెల్త్లో వందశాతం ప్రయత్నిస్తానో లేదోనని చెప్పిన ఆమె అందరి అంచనాలు అందుకుంటూ ఈ టోర్నీలో వరసగా మూడోసారి గోల్డ్‌మెడల్‌తో మురిసిపోయింది.
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018, 2022లో పసిడి పతకం కొల్లగొట్టిన మీరాబాయి గ్లాస్గోలోనూ పట్టువదల్లేదు. ఫైనల్లో బరువులు ఎత్తిన భారత స్టార్ ఈ ఎడిషన్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించింది.
🇮🇳 Mirabai Chanu sets a new commonwealth record snatching 85 kg / 187 lbs! pic.twitter.com/VKM8msjnYy
— Squat University (@SquatUniversity) July 26, 2026
ఇదివరకు 82 కిలోలతో కామన్వెల్త్లో రికార్డు నెలకొల్పిన మీరాబాయి..క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండోసారి తడబడకుండా 82 కిలోలు, మూడో ప్రయత్నంలో 85 కిలోలు ఎత్తి సరికొత్త రికార్డు సాధించింది. అనంతరం 105 కిలోలను సైతం అవలీలగా ఎత్తిన మీరాబాయి పసిడి పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. తద్వారా భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.
రిషికాంత సింగ్

మీరా కంటే ముందు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే చనంబమ్ రిషికాంత సింగ్ (CRishikanta Singh) రజతంతో మెరిశాడు. పురుషుల 60 కిలోల విభాగంలో సత్తా చాటిన అతడు రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్డ్ రికార్డు నెలకొల్పిన రిషికాంత సింగ్ పసిడి వేటలో వెనకబడి.. వెండి వెలుగులు విరజిమ్మాడు. మలేషియా వెయిట్‌లిఫ్టర్ మొహమద్ అనిక్ బిన్ కస్దాన్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. రిషికాంత్, మొహమూద్లు.. ఇద్దరూ విజయవంతంగా 121 కిలోలు ఎత్తడం ఈ క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి.