ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ఇటీవల మైనర్ బాలికలకు సంబంధించి జరిగిన మూడు లైంగిక దాడి కేసులపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల స్పందన కోరింది. గ్రేటర్ నోయిడా-ఢిల్లీ బస్సు, ఆస్థా కుంజ్ పార్క్, స్వరూప్ నగర్లో జరిగిన లైంగిక దాడి ఘటనలకు సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకుంటూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ ఘటనలు 2012 నాటి నిర్భయ కేసు జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేస్తున్నాయని, ఆ ఘటన నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయని జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2012లో ఢిల్లీలో నడుస్తున్న బస్సులో నిర్భయ అని వ్యవహరించే 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
తగినంత వెలుతురు లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం లేదా గస్తీ కొరవడటం వంటి కారణాలతో బహిరంగ ప్రదేశాలు అధిక ప్రమాదకర ప్రాంతాలుగా మారడానికి అనుమతించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆస్థా కుంజ్ పార్క్ ఘటనను ప్రస్తావిస్తూ ఎల్ఎస్ఆర్ విద్యార్థులు గతం లో లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలను బలోపేతం చేయలేదని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా, హింస లేకుండా జీవించడం ప్రాథమిక హక్కు అని, నేరాలను నివారించే బాధ్యతగల అధికారులపై జవాబుదారీతనం నిర్ధారించాలని కోర్టు తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మహిళలు, మైనర్లపై జరిగిన లైంగిక హింస ఘటనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది. పార్కులు, రోడ్లు, బస్సులు, మెట్రోస్టేషన్లు, సబ్వేలు వంటి బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు భద్రత కల్పించడం అత్యవసరమని న్యాయస్థానం పేర్కొంది. తగినంత గస్తీ, నిఘా లేకపోవడం వల్ల ఈ ప్రదేశాలు సురక్షితంగా లేకుండా పోయే పరిస్థితిని అనుమతించరాదని కోర్టు స్పష్టం చేసింది.