రఘునాథపాలెం, మార్చి 9 : మక్కజొన్న పంట చేతికొస్తున్న తరుణంలో ఊరూరా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు ప్రదర్శనగా చేరుకున్నారు. తమ డిమాండ్లపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్, బొంతు రాంబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం మార్క్ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లో దళారులు తక్కువ ధరకు దిగుబడులను కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన చెందారు. మక్కలను క్వింటాకు రూ.2,400 చొప్పున మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15 నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతు సంఘాల నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, మాదినేని రమేశ్, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.