Bengal CM : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal) సువేందు అధికారి (Suvendhu Adhikari) నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనలో వివాదాస్పదంగా, పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Assembly Budget Session) ముగింపు రోజున ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
సస్పెన్షన్కు గురైన వారిలో ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో డైమండ్ హార్బర్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన ఈయన, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడని సమాచారం. వీరితోపాటు కాళీయాగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ అజ్జం హుస్సేన్, బర్తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్-ఇన్-చార్జ్ సుబర్ణ దత్తా చౌదరి, అదే స్టేషన్కు చెందిన ఎస్సై సాధన్ పాండే, కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ అమలేందు బిస్వాస్లపై వేటుపడింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో (2021-2026) పోలీసు వ్యవస్థను అనేక చోట్ల దుర్వినియోగం చేశారని, సనాతన ధర్మాన్ని అనుసరించేవారి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. అవినీతిపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 2026 మే నెలలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సువేందు ప్రభుత్వం, ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచారం కేసులో (ఆగస్టు 2024) నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.