Niranjan Reddy | కొల్లాపూర్, జనవరి 6 : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టి రాక్షస ఆనందం పొందుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం కొల్లాపూర్ మండలం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ అంజనగిరి రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రిజర్వాయర్ను పరిశీలించారు. నార్లాపూర్ రిజర్వాయర్ లోని నిల్వ ఉన్న కృష్ణానది నీళ్లను పరిశీలించారు.
రిజర్వాయర్లో మూడున్నర టీఎంసీల వరకు కృష్ణా నది నీళ్లు నిలువ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేక రైతుల పంటలు ఎండిపోయేందుకు కారణమైందన్నారు నిరంజన్ రెడ్డి. నాలుగు రిజర్వాయర్లు పూర్తయినా కృష్ణానది నీళ్లను ఎందుకు పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ సర్కారుకు పీఆర్ఎల్ఐని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ ముందు చూపుతో జూరాల వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా.. శ్రీశైలం వద్ద ప్రాజెక్టును నిర్మాణం చేయడంతోపాటు కృష్ణానది నీళ్లను ఎత్తిపోయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖకు ఆంధ్ర ఐఏఎస్ అధికారి ఆదిత్య దాసు నియమించినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఐఏఎస్ ఆదిత్య దాసులు కలిసి 90 టీఎంసీలు కాకుండా 45 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు సరిపోతాయని లేఖలు రాశారన్నారు, తెలంగాణ రాకముందుకు సతాయించారని తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరాలపాటు పచ్చగా ఉంటే మళ్లీ కాంగ్రెస్ రావడంతో పాలమూరు గొంతు కోస్తున్నారని విమర్శించారు.
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వందల టీఎంసీలను డ్రా చేస్తుంటే పాలమూరు రంగారెడ్డి పూర్తయిన ఒక్క టీఎంసీ కూడా డ్రా చేయలేదన్నారు. లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కావడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న జూపల్లికి పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలనే సోయి ఉండదని.. రేవంత్ సర్కారుకు కూడా సోయి లేదని విమర్శించారు. వెంటనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.. లేని యెడల పాలమూరు పల్లె పల్లెను కదిలిస్తామని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు.
బురద మాత్రమే ఉంది..
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టును సందర్శించడం జరిగిందని బురద మాత్రమే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి రిటైర్డ్ ఇంజనీర్ల సూచనతో 217 టీఎంసీలు నిల్వ ఉండే ఈ ప్రదేశంలో ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను ఎత్తిపోయకుండా టీఆర్ఎస్ ప్రాజెక్టును ఎండగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తుందన్నారు.

