ఆదిలాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వంటగ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ రోడ్ లో గల ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు శుక్రవా రం ప్రజలు గ్యాస్ సిలిండర్లతో పెద్ద సం ఖ్యలో బారులు తీరారు. కొన్ని రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగా కాకపోవడంతో ఉదయం నుంచి ఏజెన్సీ ముందు క్యూ కట్టా రు. దీంతో ఏజెన్సీ వద్ద పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఏజెన్సీకి చెందిన వినియోగదారులకు మూడ్రోజులుగా గ్యాస్ బుక్ కావడం లేదని, బుక్ చేసిన సిలిండర్లను నిర్వాహకులు సరఫరా చేయడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము సిలిండర్లలో కోసం ఏజెన్సీ ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. బుకింగ్ చేసుకున్న వారికి ఓటీపీ ల ద్వారా నిర్వాహకులు సిలిండర్లను పంపిణీ చేశారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని అధికారులు ప్రకటిస్తున్నా ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేయడం లేదని, బుకింగ్ విషయంలో సైతం సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు తెలిపారు. అధికారులు వంట గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీల ద్వారా సక్రమంగా సిలిండర్లు పంపిణీ అయ్యేలా చూడాలని ప్రజలు, వినియోగదారులు కోరుతున్నారు.
హోటళ్ల ముందు కట్టెలపొయ్యిలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్ల ముందు కట్టెల పొయ్యిలు కనపడుతున్నా యి.వాణిజ్య అవసరాలకు సిలిండర్లు సరఫరా కాకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు కట్టెలపొయ్యి మీద భోజనం తయారీ చేస్తున్నారు. పట్టణంలోని పలువురు సిలిండర్లు రాకపోవడంతో కట్టెల పొయ్యిలపై హోటళ్లను నడుపుతున్నారు. గ్యాస్బుడ్డిలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, హో టళ్లు మూసివేస్తే తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ప్రత్యామ్యాయంగా కట్టెల పొ య్యిల మీద వంట చేస్తున్నామన్నారు.
ఓటీపీ రావడం లేదని ఇవ్వడం లేదు..
మాకు సిలిండర్ రాకపోవడంతో పొద్దున ఏడు గంటల నుంచి ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ముందు వచ్చి క్యూలో నిల్చున్నాను. నాతో పాటు చాలా మంది ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఓటీపీ రావడం లేదని కొందరికి సిలిండర్లను నిర్వాహకులు ఇవ్వడం లేదు. ఖాళీ సిలిండర్లకో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని గోదాంకు పోయి భర్తీ సిలిండర్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్యాస్ పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– నగేశ్, వినియోదారుడు, రాంనగర్, ఆదిలాబాద్
భైంసాలో ఏజెన్సీల వద్ద బారులు
రేషన్ షాపుల వద్ద బారులు తీరడం చూశాం..ఇటీవల యూరియా కోసం రైతులు బారులు తీరడం చూశాం..ఎన్నడూ లేని విధంగా గ్యాస్ సిలిండర్ర్ల కోసం వినియోగదారులు బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నది. శుక్రవారం భైంసా పట్టణంలో ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలైన్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచే సుమారు 300ల మంది గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గ్యాస్ బుక్ చేసుకున్న సిలిండర్లు ఇంటికి డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు నేరుగా గోదాం వద్దకు వెళ్లి గ్యాస్ సిలిండర్లను తీసుకుంటున్నారు. ఒక్కసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరోసారి బుకింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నది. అధికారులు దృష్టి సారించి గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతున్నారు.