రామగిరి, జనవరి 06 : ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలన్నారు. పేద ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ ఎర్రజెండా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ప్రపంచంపై పెత్తనం చెలాయించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను అరెస్ట్ చేసిందని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమలను తిప్పికొట్టాలన్నారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అప్పులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్నారు. భవిష్యత్ దేశానికి కమ్యూనిస్టులు అవసరమన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా అభిమానం గెలుచుకోవాలన్నారు.
నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం బలమైన ప్రజా ఉద్యమాలు చేసి జిల్లాను ముందు భాగాన ఉంచుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఎల్బీసీకి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసేందుకు నిధులు కేటాయించాలన్నారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సిపిఎం బలపరిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Ramagiri : ప్రజా పోరాటాలతోనే పార్టీ బలోపేతం : జాన్ వెస్లీ