వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు. చట్టసభల్లో సభ్యులూ కారు. అయినా వారి చేతిలోనే ‘పవర్’! ఆలిండియా సర్వీసెస్ అధికారులను రబ్బర్ స్టాంపులుగా మార్చి పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు కారణం ఒక్కటే. ముఖ్యనేతకు సన్నిహితులు! ‘షాడో’లుగా సర్కార్‌ను శాసిస్తున్నవారు! వాళ్లు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్యనేత నేరుగా మాట్లాడినట్టే. వాళ్లు కన్నెర్ర జేస్తే పైనున్న ఆయనకు ఆగ్రహం వచ్చిందన్నట్టే. పోస్టింగులు, బదిలీలు, పైరవీలు, పంచాయితీలు, సెటిల్ మెంట్లు, ప్రాజెక్టులు.. ఇలా ఫైలు ఏదైనా వారి కనుసన్నల్లో కదలాల్సిం దే. మంత్రుల పేషీలకు దీటుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లో ఏకంగా కార్యాలయాన్నే తెరిచారని ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో పాలన మొత్తం ‘షాడో సీఎంవో’ గుప్పిట్లో ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, శాఖల కార్యదర్శుల కన్నా ‘షాడో’లే పవర్ ఫుల్ అనే చర్చ జరుగుతున్నది. పోస్టింగులు, బదిలీలు, పైరవీలు, పంచాయితీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు..ఇలా ఫైలు ఏదైనా వారి పర్యవేక్షణలోనే కదలాలట! వాళ్లు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్యనేత నేరుగా మాట్లాడినట్టేనని, వాళ్లు కన్నెర్రజేస్తే ముఖ్యనేతకు ఆగ్రహం వచ్చినట్టేనని ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మొదట్లో ‘సీఎంవో’ అనే ప్రత్యేక విభాగం లేదని, ముఖ్యమంత్రికి సహాయంగా కొందరు అధికారుల బృందం మాత్రమే ఉండేదని, వీళ్లు సలహాలు, సూచనలు ఇచ్చేవారని చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత సీఎంవోను బలోపేతం చేశారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. వారికి ప్రత్యేకంగా శాఖలు కేటాయించి, వారిపై అజమాయిషీ చేసే అధికారం కట్టబెట్టారని అంటున్నారు. ఇప్పుడు శిష్యుడు మరో అడుగు ముందుకేసి, ఏకంగా షాడో సీఎంవోనే ఏర్పాటు చేశాడన్న ప్రచారం జరుగుతున్నది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తరలించే రూ.1,000 కోట్ల మూటల్లో ముఖ్యనేత పాలుకు వచ్చిన రూ.500 కోట్లు సర్దుబాటు చేసే బాధ్యత షాడో సీఎంవోకే అప్పగించినట్టు సమాచారం.
హుస్సేన్‌సాగర్ ఒడ్డున కేసీఆర్ ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించింది. ఇది రాష్ట్ర పరిపాలనా కేంద్ర కార్యాలయం. ఇందులో సీఎంవో, మంత్రిత్వశాఖల కార్యాలయాలుంటాయి. ప్రతి నిర్ణయం ఇక్కడి నుంచే తీసుకొని అమలు చేస్తారు. ఇక్కడ కదిలే ప్రతి ఫైల్‌కూ జవాబుదారీతనం ఉంటుంది. కానీ.. దీనికి సమాంతరంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఒక కార్యాలయం తెరిచినట్టు సమాచారం. ముఖ్యనేత అనుచరుల కోసం దీనిని ప్రారంభించారని, ఇది రాజ్యాంగేతర శక్తుల అడ్డా అని, షాడో నేతల అసాంఘిక కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. అందుకే దీన్ని ముద్దుగా ‘షాడో సీఎంవో ఆఫీస్’ అని పిలుచుకుంటున్నారు. ఇందులో ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులు తొమ్మిది మంది ఉంటారని సమాచారం. ఈ నవరత్నాలు రాజ్యాన్ని గుప్పిట పెట్టుకొని, ఒక్కొక్కరు మూడునాలుగు శాఖలకు షాడో మంత్రులుగా వెనుక ఉండి నడిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వసూళ్లు, సెటిల్మెంట్లు, రాజీలు, ల్యాండ్ క్లియరెన్స్‌లు, పైరవీలు, పోస్టింగులు ఇలా ఎవరికి పట్టున్న అంశాల ఆధారంగా వాళ్లు శాఖలు పంచుకున్నట్టు సమాచారం. సంబంధిత మంత్రులకు తెలియకుండా, ఆయాశాఖల కార్యదర్శులతో సంబంధం లేకుండా షాడో కార్యాలయంలో చిటికెలో పనులు జరిగిపోతాయని చెప్తున్నారు.
ముఖ్యనేతకు ప్రాణస్నేహితుడు పోలీసు శాఖకు షాడో మంత్రిగా ఉన్నారని మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నది. పోలీసుశాఖలో ఆయన ఎంత చెప్తే అంత అని, ఆయన కనుసైగ చేస్తే పోలీసులు రంగంలోకి దిగుతారని చెప్పుకొంటున్నారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా మంత్రుల ఇండ్లలోకి వెళ్లటానికి కూడా వెనుకాడరని చెప్తున్నారు. ఇటీవల సిమెంటు ఫ్యాక్టరీ పంచాయితీలో యజమాని కణతకు గన్ను పెట్టారనే ఆరోపణల మీద అర్ధరాత్రి వేళ మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించింది షాడో మంత్రేనని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంత్రి ఓఎస్డీ సుమంత్‌ను వెతికి పట్టుకోవడం కోసం ఆయనే అప్పటికప్పుడు 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేయించినట్టు సమాచారం. జరుగుతున్న తతంగాన్ని ఆపలేక, షాడో హోం మంత్రికి ‘నో’ చెప్పలేక పోలీసు ఉన్నతాధికారి తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో నంబర్ 2గా గుర్తింపు ఉన్న మంత్రి కొడుకు భూ కబ్జా వ్యవహారంలో ఆయనే ముందుండి కేసులు నమోదు చేయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సదరు షాడో మంత్రి విద్యాశాఖ వ్యవహారాలు సైతం చక్కబెడుతున్నారని ప్రచారంలో ఉన్నది. మంచాల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.వంద కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం దాదాపు చివరి దశలో ఉన్న నేపథ్యంలో హోం శాఖ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. డీజీ స్థాయి పోస్టు నుంచి కానిస్టేబుల్ పోస్టింగ్ వరకు ఆయన ఓకే చెప్తేనే ఫైల్ కదులుతుందని ఆశాఖ అధికారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
పీఏ పేరుతో నమ్మిన బంటుగా వ్యవహరించే మరో వ్యక్తికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు తదితర వ్యవహారాలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. అందాల పోటీల సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. తెలంగాణ ప్రజలకు సుపరిచితమే. హైడ్రాను వసూళ్ల సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల ఆక్రమణల సాకుతో రియల్టర్లను భయపెట్టి, ఇండ్లను కూల్చకుండా ఉండాలంటే రూ.కోట్లు సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నగరం అంతటా అడ్వైర్టెజ్‌మెంట్ కాంట్రాక్టులు, ఫ్లెక్సీల అనుమతుల్లో ఈయన పర్యవేక్షణలోనే దందాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, టెండర్ల ప్రక్రియలో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యనేత తన రక్త సంబంధీకులకు రెవెన్యూ శాఖను అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ప్రచారంలో ఉన్నది. రూ.100 కోట్లకు తక్కువ ఉంటే ఫైల్ దాదాపు వీరు ముట్టుకోరని సమాచారం. ఆదిభట్ల సీలింగ్ భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం మంచిరేవుల భూముల విషయంలో మంత్రికి, ముఖ్యనేతకు మధ్య జరిగిన పంచాయితీ వరకు వీళ్లే చక్కదిద్దుతున్నట్టు తెలిసింది. భూమాత పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న 3 లక్షల ఎకరాల భూముల సెటిల్మెంట్ వీరి పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టు సమాచారం. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఎల్ఏజీ నంబర్లతో నిషేధిత జాబితాలో ఉన్న భూములు గుర్తించి, రైతులతో మాట్లాడుకొని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో హైరైజ్ భవనాల నిర్మాణం ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఇప్పటికే 1,000 ఎకరాల భూమిని క్లియర్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఐఅండ్‌పీఆర్ శాఖలో వాణిజ్య ప్రకటనలు తదితర వ్యవహారాలు కూడా వీరే చూస్తున్నట్టు చెప్తున్నారు.
ఇటీవలే ముఖ్యనేత గ్రూప్‌లో ఆంతరంగికుడిగా చేరిన మరో నేత.. భూ వ్యవహాలు, ఇసుక మాఫియాను చూస్తున్నట్టు తెలిసింది. మూసా పేటలోని 15 ఎకరాల భూమి విషయంలో ముఖ్యనేతకు దగ్గరై, కొద్దికాలంలోనే నమ్మకాన్ని చూరగొన్నట్టు సమాచారం. సర్వే నంబర్ 210లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. 1970 నుంచి వివాదంలో ఉన్న భూములను గంపగుత్తకు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పించినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ముఖ్యనేత సమావేశం పెట్టి భూములను ప్రైవేట్‌కు ఇచ్చేందుకు ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో అధికారికంగా 1,200 ఫ్లాట్లు, అనధికారంగా మరో 600 ఫ్లాట్లు మొత్తం కలిపి 1,800 ఫాట్ల నిర్మాణం జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఆంతరంగికుడు రూ.400 కోట్లు అప్పజెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతా బడాబాబులే ఉన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ స్కామ్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరుగుతున్నట్టు ప్రచారంలో ఉన్నది.
షాడో సీఎంవో వ్యవహారంతో మంత్రులు కుతకుతలాడిపోతున్నారని సమాచారం. ఇప్పటికే తమ శాఖల్లో తన నమ్మకస్తులకు పోస్టింగ్‌లు ఇచ్చుకున్నాడని, తమ సిఫార్సులను సైతం పక్కన పడేశాడంటూ ఆరోపిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ పరిధిలోని శాఖలకు సంబంధించి నిర్ణయాలు జరిగిపోతున్నాయని మండిపడుతున్నారు. ఇప్పుడు పెత్తనం మొత్తం షాడో సీఎంవో చేతుల్లోకి వెళ్లిపోవడంతో ‘ఇక మేమెందుకు దండుగ?’ అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట! అందుకే కొందరు మంత్రులు సందర్భం దొరికినప్పుడల్లా తమ ఆక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారని అంటున్నారు. ముఖ్యనేతను టార్గెట్ చేస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తున్నారని చెప్పుకొంటున్నారు.
గనుల, మైనింగ్, సింగరేణి బరువు బాధ్యతలు బామ్మర్దికి అప్పగించారని సమాచారం. ‘సైట్ విజిట్’ నిబంధనకు దుమ్ము దులిపి అమల్లోకి తెచ్చింది ఈ షాడో మంత్రే అని చెప్పుకొంటున్నారు. సైట్ విజిట్ పేరుతో టెండర్‌దారులను గుర్తించడం, వాళ్లను భయపెట్టి, బెదిరించి లెస్ టెండర్ వేయించడం వంటివి చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికే సింగరేణి గనులకు సంబంధింయిచి బామ్మర్ది ఏడు గనుల్లో టెండర్లు దక్కించుకున్నట్టు సమాచారం. ఇందులో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మైనింగ్ కాంట్రాక్టులన్నీ బినామీలకు అప్పగిస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బామ్మర్ది కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేపడితే షాడో కార్యాలయం గుట్టు బయటికి వస్తుందని చెప్తున్నారు.
ముఖ్యనేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న మరో మహిళ కూడా సచివాలయంలో కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యకార్యదర్శి వరకు బ్యూరోక్రాట్ల పోస్టింగులను ఆమె ప్రభావితం చేస్తున్నారని సమాచారం. ఈమె అనుమతి లేకుంటే అసలు సీఎంవోలోని బ్యూరోక్రాట్లను కలువడం అసాధ్యం అని చెప్తున్నారు. సీఎంవో మీద ఆమెకు ఉన్న పట్టు ఐఏఎస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘ఆయన’ ముఖ్యనేతకు స్నేహితుడిగా గుర్తింపు ఉండటంతో సచివాలయంలో సమాంతర అధికారాన్ని నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. ఆమెతో కలిసి కీలక శాఖల ఫైళ్లను నియంత్రించడం, కాంట్రాక్టర్ల సమస్యలను సెటిల్ చేయడం వంటి కార్యక్రమాలు వారి కనుసన్నల్లోనే జరుగుతాయని సమాచారం. వాళ్లకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్వయంగా ముఖ్యనేత మౌఖిక ఆదేశాలిచ్చారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ముఖ్యనేతకు ఆయన తోడు. ఆయన లేకుండా దేశ, విదేశీ అధికారిక పర్యటనలు జరుగవనే ప్రచారం ఉన్నది. ఆయనకు ముఖ్యనేత షాడో సినిమాటోగ్రఫీ, ఫార్మా, ఇండస్ట్రీస్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ డెకన్ సిమెంట్స్ ప్రతినిధుల కణతకు గన్ గురిపెట్టిన వ్యవహారం ఈ షాడో మంత్రి గెస్ట్‌హౌస్‌లోనే జరిగిందని అప్పట్లో మీడియాలో ప్రసారమైంది. ఈ గెస్ట్‌హౌస్ ముఖ్యనేత ఇంటి వెనుకాలే ఉన్నదని చెప్తున్నారు. చిన్న కష్టమైనా.. సినిమా కష్టమైనా సినీ నటీనటులు అంతా ఆయన చుట్టే తిరుగుతారని సమాచారం. టికెట్ల రేట్ ఆయన ఎంత ఫిక్స్ చేస్తే అంతకే జీవో వస్తుందని ప్రచారం జరుగుతున్నది. సంక్రాంతికి విడుదలైన సినిమాలకు టికెట్ల ధరల పెంపు ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెప్తున్నారు. ముందుగా సినీ హీరోలు, ప్రొడ్యూసర్లను ఇంటి వెనుక నుంచి ముఖ్యనేతకు కల్పించిన తర్వాతే టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులు బయటికి వచ్చినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్తున్నాయి. రెడ్ క్యాటగిరీలో ఉన్న ఫార్మా పరిశ్రమలు ప్రతి ఐదేండ్లకోసారి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. గడువు తీరిన లైసెన్స్ రెన్యువల్‌కు రూ.2 కోట్ల చొప్పున డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లేదంటే పీసీబీ అధికారులను పంపించి కంపెనీ మూత వేయిస్తున్నారని పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.