హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది. పలు సోషల్‌మీడియాల్లో వచ్చినవి తప్పుడు కథనాలని తెలిపింది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు పుణె సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)కు సాంకేతిక పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించామని, ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా బరాజ్‌ల పునరుద్ధరణ చేపట్టాల్సి ఉందని పేర్కొన్నది.
పరీక్షలు నిర్వహించాలంటే బరాజ్‌ల ప్రాంతం ఇసుక, నీరులేకుండా ఉండాలని సూచనల మేరకు బరాజ్ ఎగువ, దిగువన ఇసుక తొలగింపు చేపట్టామని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అనుమతితో, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీలే, సాగునీటిశాఖ అధికారుల పర్యవేక్షణలోనే అన్నారం బరాజ్ ఫ్లోర్‌పై ఇసుక తొలగింపు పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
ఇసుక తొలగింపు చేయకుండా బరాజ్‌లోని వెంట్ల భాగంలో గ్రిడ్ మారింగ్, కొలతలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. ఇసుక తొలగింపు వల్ల బరాజ్‌కు ఎలాంటి నష్టం లేదని, అది పూర్తిగా పియర్స్, ఫ్లోర్ భాగాల పరీక్షల కోసమేనని, కానీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా వేదికలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని వివరించారు.