ఎదులాపురం, మార్చి 13 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 10,928 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులను అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో పాటు 13 మంది సీ-కస్టోడియన్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పదో తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పా రదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి విద్యాశాఖ అధికారులు, పరీక్షా కేంద్రాల ఇన్చార్జిలు, ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు, బెంచీల వంటి కనీస వసతులు, వోఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలన్నారు. ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని హాల్ టికెట్ చూపించిన విద్యార్థులను ఉచితంగా అనుమతించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేసినట్లు తెలిపారు. 200 మీటర్ల దూరం వరకు ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించినట్లు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, మార్చి 13 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9758 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని నిర్మల్ జిల్లా డీఈవో భోజన్న తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలకు చీఫ్ ఎగ్జామినేషన్, డిపార్ట్ మెంటల్ అధికారులతో పాటు 13 అడిషనల్ డీవోలు, 7 అడిషనల్ కస్టోడియన్లు, 47 మంది సిట్టింగ్ స్కాడ్లు, 535 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్కాడ్లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సెల్ నం. 905998773 నంబర్లో సంద్రించాలన్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్మల్లోని విజయ, చాణక్య ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను డీఈవో పరిశీలించారు.