Aloe Vera For Skin | శరీర ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. మెరిసే ఆరోగ్యకరమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు అనేక రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను కూడా వాడుతూ ఉంటారు. అయినప్పటికీ మనలో చాలా మంది అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలనుకునే వారు ఖరీదైన ఉత్పత్తులను వాడడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మన చర్మానికి మేలు చేసే ఆహారాలు అనేకం ఉన్నాయి. వాటిలో కలబంద రసం కూడా ఒకటి. చర్మాన్ని రక్షించడంలో, మెరిసే చర్మాన్ని అందించడంలో కలబంద రసం మనకు ఎంతో సహాయపడుతుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు తెలియజేస్తున్నారు.
కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిలో దాదాపు 98. 5 శాతం నీరు ఉంటుంది. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చక్కెర పానీయాలకు బదులుగా కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది చర్మంపై పగుళ్లు రాకుండా ఉంటాయి. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక గ్లాస్ కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ సమస్యలతో బాధపడే వారు కలబంద రసాన్ని కలబంద జెల్ ను మాస్క్ లాగా వేసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
కలబంద రసం వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల చర్మంపై ఉండే గీతలు, ముడతలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కలబంద రసంలో విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మం యవ్వనంగా కనబడేలా చేయడంలో దోహదపడతాయి. దినచర్యలో భాగంగా రోజూ కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చర్మం మెరుపును సొంతం చేసుకుంటుంది. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమయ్యే కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కొల్లాజెన్ చర్మానికి స్థితిస్థాపకతను, ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది. కనుక మెరిసే చర్మం కోరుకునే వారు కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కలబందలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. మొటిమలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఈవిధంగా కలబంద రసం మన చర్మ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ కలబంద రసాన్ని తయారు చేసేటప్పుడు తాజా, స్వచ్ఛమైన కలబందను ఉపయోగించడం చాలా అవసరమని కూడా వైద్యులు చెబుతున్నారు.